: కేసీఆర్ దారెటు?... రాష్ట్రపతి ఎన్నికలను ప్రభావితం చేసే స్థితిలో తెలంగాణ!
రాష్ట్రపతి ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోంది. ఓ వైపు విపక్ష పార్టీలన్నింటినీ ఏకం చేసి, అధికారంలో ఉన్న బీజేపీ నిలిపే అభ్యర్థిపై పోటీకి దిగాలని కాంగ్రెస్ ప్రయత్నాలు సాగిస్తున్న వేళ, దక్షిణాదిలో కీలక రాష్ట్రమైన తెలంగాణను పాలిస్తున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయం ఎటువైపు ఉంటుందన్నది కీలకంగా మారింది. కేంద్రంలోని మోదీ సర్కారుతో స్నేహపూర్వకంగా ఉంటున్నామన్న సంకేతాలను ఇప్పటికే పలుమార్లు పంపిన కేసీఆర్, రాష్ట్రపతి ఎన్నికలను ప్రభావితం చేసేంత ఓట్లను కలిగివున్నారు. నోట్ల రద్దును నరేంద్ర మోదీ ప్రకటించిన వేళ, ఆ నిర్ణయానికి కేసీఆర్ మద్దతు పలికిన సంగతి తెలిసిందే.
ఇక రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జూలైలో పదవీ విరమణ చేయనున్నారు. బీజేపీ నిలిపే అభ్యర్థిపై ఏకాభిప్రాయం కుదరని పక్షంలో, మరో అభ్యర్థి పేరును తెరపైకి తేవాలన్నది సోనియా అభిప్రాయం. కాగా, ప్రస్తుత గణాంకాల ప్రకారం, విపక్షాలను పక్కన బెడితే, తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి బీజేపీ 25 వేల ఓట్ల దూరంలో ఉంది. టీఆర్ఎస్ కు 22 వేల ఓట్లు ఉండగా, ఆ పార్టీ అధినేత కేసీఆర్ డెసిషన్ మేకర్ గా నిలిచే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇక బీజేపీ నిలిపే అభ్యర్థికి తాము మద్దతిచ్చేది లేదని టీఆర్ఎస్ చెప్పడం లేదు. ఎన్డీయే నిలిపే అభ్యర్థికి మద్దతిచ్చే అవకాశాలను తోసిపుచ్చలేమని ఆ పార్టీ సీనియర్ నేత పీ రాజేశ్వర్ రెడ్డి స్వయంగా వెల్లడించడం గమనార్హం. ఇటీవలి కాలంలో రైతుల కష్టాలకు, మిరప వంటి పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడానికి కారణం మీరంటే, మీరని టీఆర్ఎస్, బీజేపీలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్న సంగతి తెలిసిందే.
మిరప పంట క్వింటాలుకు ప్రస్తుతం ఆఫర్ చేస్తున్న రూ. 3 వేల స్థానంలో రూ. 5 వేలు ఇస్తామంటూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ ప్రకటిస్తూ, రైతుల కష్టాలను తీర్చేందుకు టీఆర్ఎస్ ఏమీ చేయడం లేదు కాబట్టే తాము కల్పించుకున్నామని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇక తెలంగాణలో పాగా వేయాలని చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే బీజేపీ ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నదని టీఆర్ఎస్ కూడా విమర్శించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికల్లో కేసీఆర్ దారెటు? అన్న చర్చ జోరుగా సాగుతోంది.