: ‘బాహుబలి-2’కు రూ.200 కోట్లకు పైగా బీమా!
ఫిల్మ్ ప్యాకేజ్ ఇన్సూరెన్స్ కింద ‘బాహుబలి-2’ సినిమాకు బీమా చేసినట్టు ఫ్యూచర్ జనరాలీ ఇన్సూరెన్స్ కంపెనీ వెల్లడించింది. ఈ సినిమాకు రూ.200 కోట్లకు పైగా బీమా చేశారని, ప్రీ-ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ లో ఏదైనా ప్రమాదం జరిగితే ఈ పాలసీ కింద కవరేజ్ ఉంటుందని పేర్కొంది. కాగా, ఈ సందర్భంగా ఫ్యూచర్ జనరాలీ ఇన్సూరెన్స్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ కేజీ కృష్ణమూర్తి రావు మాట్లాడుతూ, ఈ ఆర్థిక సంవత్సరంలో 160 సినిమాలకు బీమా చేశామని, ఇందులో ఎక్కువగా బాలీవుడ్ సినిమాలు ఉన్నాయని అన్నారు. ఇప్పుడిప్పుడే, దక్షిణాది సినిమాలపై దృష్టి పెట్టామని, ఫిల్మ్ ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా ఇన్సూరెన్స్ చేస్తున్నట్టు చెప్పారు. ఫిల్మ్ ప్యాకేజ్ ఇన్సూరెన్స్ కింద నటులు అనారోగ్యానికి గురైనా, మృతి చెందినా, ప్రకృతి విపత్తులు, ప్రమాదాల కారణంగా సినిమా షెడ్యూల్ లో ఆలస్యమైనా, షూటింగ్ సమయంలో సినిమా పరికరాలు దెబ్బతిన్నా ఈ బీమా వర్తిస్తుందన్నారు.