: అమర జవాన్ల పిల్లల కోసం ‘పతంజలి ఆవశ్య సైనిక్ స్కూల్’
అమర జవాన్ల పిల్లల కోసం ఓ సైనిక్ స్కూల్ ను ఏర్పాటు చేయనున్నట్టు ‘పతంజలి’ సంస్థ సహవ్యవస్థాపకుడు, ప్రముఖ యోగ గురువు బాబా రాందేవ్ వెల్లడించారు. ఢిల్లీలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేశం కోసం ప్రాణాలు అర్పించిన జవాన్ల పిల్లల కోసం ‘పతంజలి ఆవశ్య సైనిక్ స్కూల్’ ను ఏర్పాటు చేయాలని అనుకుంటున్నామని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో తమ సంస్థ రూ.10,561 కోట్ల టర్నోవర్ ను సాధించిందని అన్నారు.
రాబోయే రెండేళ్లలో ‘పతంజలి’ పెద్ద సంస్థగా అవతరించనుందని, తమ సంస్థ దెబ్బకు మల్టీనేషనల్ కంపెనీలు మూసుకోవాల్సిందేనని అన్నారు. ఈ సందర్భంగా గోమూత్రం ఉత్పత్తికి సంబంధించి వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం తగదని అన్నారు. ఎఫ్ఎస్ఎస్ఏఐ నిబంధనలకు అనుగుణంగా తమ సంస్థ ఉత్పత్తులు ఉంటాయని, తమ ఉత్పత్తులను వేలెత్తి చూపడానికి ఆస్కారం లేదని బాబా రాందేవ్ అన్నారు.