: ప్రదీప్ కేసు విచారణ ముమ్మరం... పావని, శ్రావణ్ ల సెల్ ఫోన్లను సీజ్ చేసిన పోలీసులు
నిన్న తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో మరణించిన టీవీ నటుడు ప్రదీప్ కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ కేసులో భాగంగా తాము అనుమానిస్తున్న ప్రదీప్ భార్య పావని, ఆమె తన అన్నగా చెబుతున్న శ్రావణ్ ల సెల్ ఫోన్లను సీజ్ చేశారు. ఈ సెల్ ఫోన్ల నుంచి తమకు కీలక సమాచారం అందుతుందని ఇప్పుడు పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. కాగా, ఈ ఉదయం పోస్టుమార్టం తరువాత ప్రదీప్ మృతదేహాన్ని ఆయన ఇంటికి తరలించగా, పలువురు సినీ, టీవీ ప్రముఖులు నివాళులు అర్పించారు. కాసేపట్లో జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ప్రదీప్ అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ప్రదీప్ అంత్యక్రియలు ముగిసిన తరువాత విచారణను ముమ్మరం చేస్తామని, ఇప్పటికే సెల్ ఫోన్లను టెక్ నిపుణులకు అప్పగించామని, వాటితో పాటు ప్రదీప్ ఫోన్ నూ విశ్లేషిస్తున్నామని, మొన్న రాత్రి శ్రావణ్ పుట్టిన రోజు వేడుకల అనంతరం ప్రదీప్ ఎక్కడికి వెళ్లాడు? ఎవరికి ఫోన్ చేసి మాట్లాడాడు? అన్న విషయాలు కీలకమని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఘటనా స్థలం నుంచి క్లూస్ టీమ్ పలు ఆధారాలను సేకరించిందని, ఇరుగు పొరుగు వాళ్ల నుంచి స్టేట్ మెంట్ తీసుకున్నామని తెలిపారు. అతని భార్య చెబుతున్న విధంగా అద్దం పగులగొట్టినందుకే ఆయన మృతదేహంపై రక్తపు మరకలు వచ్చాయా? లేక మరేదైనా ఘటన జరిగిందా? అన్న కోణంలోనూ దర్యాఫ్తు సాగుతుందని వెల్లడించారు.