: రూ. 1కి పడిపోయిన టమోటా ధర!
మిరప, పసుపు, ఉల్లి... ఇప్పుడిక టమోటా వంతు. మార్కెట్లో ఉన్న డిమాండుతో పోలిస్తే, అధికంగా ఉత్పత్తి అవుతుండడంతో కిలో టమోటా ధర రూ. 1కి పడిపోయింది. వాస్తవానికి ఈ సంవత్సరం ప్రారంభంలో కిలో రూ. 30 వరకూ పలికిన ధర, ఫిబ్రవరి నుంచి పతనం దిశగా సాగింది. రెండు వారాల క్రితం నాణ్యతను బట్టి రూ. 10 నుంచి రూ. 20 వరకూ ఉన్న ధర, ఇప్పుడు మరింతగా పడిపోయింది.
ఆసియాలో అతిపెద్ద టమోటా మార్కెట్ గా ఉన్న మదనపల్లి యార్టుకు రోజుకు 500 టన్నుల వరకూ పంట వస్తోంది. మరో వారం పదిరోజుల్లో మరింత పంట చేతికందే అవకాశాలు ఉండటంతో రోజుకు వెయ్యి టన్నుల వరకూ మార్కెట్ కు వచ్చే అవకాశాలు ఉన్నాయని, దానివల్ల ధరలు మరింతగా పడిపోతాయని వ్యాపారులు భావిస్తున్నారు. కాగా, మిర్చి రైతులతో పాటే టమోటా రైతులనూ ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి అమర్ నాథరెడ్డి వ్యాఖ్యానించారు.