: ‘సంప్రదాయక్’, ‘దృష్టికోణ’ పదాలు తప్పుగా రాశాడని పెళ్లి రద్దు చేసుకుంది...!
వివాహం విషయంలో యువతీ యువకులు ఎంత క్లారిటీతో ఉంటున్నారో తెలిపే ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఎవరూ ఊహించని కారణంతో వివాహం ఆగిపోయింది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... ఉత్తరప్రదేశ్ లోని మెయిన్ పురి జిల్లాకు చెందిన ఓ యువతి, యువకుడికి పెద్దలు వివాహం నిశ్చయించారు. అబ్బాయి సీనియర్ సెకండరీ పరీక్ష (12వ తరగతి) పాసవ్వగా, అమ్మాయి 5వ తరగతి మాత్రమే పాసయ్యింది. రెండు కుటుంబాలు అంగీకారానికొచ్చి వివాహం నిశ్చయించాయి. ఈ క్రమంలో వివాహానికి అంతా సిద్ధమైంది. కొద్ది రోజుల్లో వివాహం జరగనుందనగా...కుటుంబ సభ్యుల సమక్షంలో వారిద్దరూ కలుసుకున్నారు.
కేవలం 5వ తరగతి చదివిన యువతి అన్న కారణంతో...అసలు చదువుకుందో లేదో తెలుసుకునేందుకు అందరి సమక్షంలో కొన్ని పదాలు రాయాలని ఆమెను కోరాడు. ఆమె అతను చెప్పిన పదాలన్నీ రాసి చూపించింది. దీంతో ఆనందం వ్యక్తం చేసిన వరుడు వివాహానికి అంగీకారం తెలిపాడు. ఈ సారి యువతి వంతు వచ్చింది. దీంతో ఆమె ‘సంప్రదాయక్’, ‘దృష్టికోణ’ పదాలను హిందీలో రాసి చూపాలని కోరింది. వాటిని రాసి ఆమెకు చూపించాడు. అంతే, ఆ రెండు పదాల్లో బోలెడు తప్పులున్నాయని చెప్పి, అతడితో వివాహం వద్దని తేల్చిచెప్పింది. బంధువులు, కుటుంబ సభ్యులు ఆమెకు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా ఆమె వివాహానికి అంగీకరించకపోవడం విశేషం. దీంతో వివాహం రద్దైపోయింది.