: భవిష్యత్ వైద్యం.. రోబోటిక్ సర్జరీలు!
భారత్ లో భవిష్యత్ వైద్యం రూపు రేఖలు మారనున్నాయి! వైద్యులు నిర్వహించాల్సిన కొన్ని సర్జరీలను ఇకపై ‘రోబో’లు చేయనున్నాయి. ఢిల్లీలోని సఫ్దార్ జంగ్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకోసం సుమారు రూ.18 కోట్లు విలువ చేసే ఓ రోబోను కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఆసుపత్రి ఉంది. ముఖ్యంగా, పేద రోగులకు ఈ సౌకర్యాన్ని ఉచితంగా అందజేయనుంది. అదే సమయంలో, ప్రైవేట్ వార్డ్స్ లో అడ్మిట్ అయిన వారికి సబ్సిడీపై ఈ సౌకర్యాన్ని అందించనున్నారు.
ఈ సందర్భంగా యూరాలజీ, రెనాల్ ట్రాన్స్ ప్లాంట్ విభాగాధిపతి, ప్రొఫెసర్ అనుప్ కుమార్ మాట్లాడుతూ, ప్రైవేటు ఆసుపత్రుల్లో నిర్వహించే రోబోటిక్ సర్జరీస్ ఖరీదు దాదాపు నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల వరకు ఉంటుందన్నారు. రోబోటిక్ సర్జరీ విధానం ఎలా ఉంటుందో ఆయన వివరిస్తూ.. శస్త్ర చికిత్స నిపుణుడి ఆధ్వర్యంలో వైద్య పరికరాలను రోబో చేతుల్లో ఉంచుతారని, రోబోను ఆపరేట్ చేసే సిస్టమ్ వద్ద సదరు నిపుణుడు కూర్చుని, 3డీ వ్యూ ద్వారా పేషెంట్ బాడీనీ స్క్రీన్ ద్వారా పర్యవేక్షిస్తుంటాడని చెప్పారు. శస్త్ర చికిత్స నిపుణుడి చేతి కదలికలు రోబోకు చేరడం ద్వారా శస్త్రచికిత్స జరుగుతుందన్నారు. ఈ వ్యవహారమంతా, కెమెరా ద్వారా లైవ్ 3 డీ ఇమేజెస్ ను సర్జన్ గమనిస్తూ ఉంటారని, ఇదంతా లాప్రోస్కోపిక్ సర్జరీని పోలి ఉంటుందని చెప్పారు. రోబోటిక్ సర్జరీలు సత్ఫలితాలు ఇస్తే ఇతర విభాగాల కోసం మరిన్ని రోబోలను కొనుగోలు చేస్తామని వివరించారు.