: కశ్మీర్ వివాదంపై మేము అలా అనలేదు: చైనా
కశ్మీర్ వివాద అంశం పరిష్కారానికి చైనా సహకరిస్తుందని, భారత్-పాక్ ల మధ్య మధ్యవర్తిత్వం జరిపేందుకు సిద్ధమని ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఈ అంశంపై స్పందించిన చైనా ఆ వార్తలను ఖండించింది. భారత్, పాక్ ద్వైపాక్షిక చర్చల ద్వారా మాత్రమే కశ్మీర్ వివాదానికి పరిష్కారం దొరుకుతుందని, దీనిపై తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని తేల్చి చెప్పింది. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ)కు చైనా భారీగా పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో ఇటీవలే ఆ దేశ పత్రిక 'గ్లోబల్ టైమ్స్ కశ్మీర్ అంశంపై ఇటువంటి కథనాన్ని ప్రచురించడంతో చైనా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
భారత్-పాక్ ల మధ్య సంబంధాల మెరుగుకు తమ దేశం నిర్మాణాత్మక పాత్ర మాత్రమే పోషించ గలదని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గెంగ్ షుయాంగ్ అన్నారు. కశ్మీర్ అంశంపై మాత్రం పాక్, భారత్‌లు చర్చించుకొని శాంతియుత పరిష్కారం కనుగొనాలని ఆయన అన్నారు.