: జగన్ సీఎం అవుతారని ఒకడు.. ప్రధాని అవుతారని మరొకడు అంటున్నారు: మంత్రి దేవినేని ఎద్దేవా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గుంటూరులో చేసిన రైతు దీక్షపై ఆంధ్రప్రదేశ్ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు విమర్శలు గుప్పించారు. జగన్ సీఎం అవుతారని ఒకడు... ప్రధాని అవుతారని మరొకడు మాట్లాడుతున్నారని వైసీపీ నేతలను ఎద్దేవా చేశారు.
ఈ రోజు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ... 'వైసీపీ దొంగలా నన్ను విమర్శించేది?' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు దీక్ష పేరిట వైసీపీ నాటకాలాడిందని అన్నారు. ఎన్నో కేసులు ఉన్న వ్యక్తులు తమని విమర్శిస్తున్నారని అన్నారు. రాష్ట్ర విభజనకి ప్రధాన కారణం బొత్స పీసీసీ అధ్యక్షుడిగా ఉండడం, రఘువీరారెడ్డి మంత్రిగా ఉండడమేనని ఆయన ఆరోపించారు. అటువంటి వ్యక్తులు ఇప్పుడు తమపై విమర్శలు గుప్పిస్తున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్, వైసీపీ ఇరు పార్టీల నేతలు దొంగలేనని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు ఎంతగానో కష్టపడి ఎన్నో కంపెనీలను తీసుకొస్తోంటే ప్రతిపక్ష నేతలు అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.