: ఒక‌రిపై ఒక‌రికి ఎటువంటి అనుమానాలు లేవు: న‌టుడు ప్ర‌దీప్ మృతిపై ఆయ‌న భార్య


తెలుగు టీవీ న‌టుడు ప్రదీప్ ఆత్మహత్య చేసుకోవ‌డం క‌ల‌క‌లం రేపుతోన్న విషయం తెలిసిందే. హైదరాబాద్ నార్సింగ్ పరిధిలోని అలకాపురి కాలనీ గ్రీన్ హోమ్స్ లోని అపార్ట్ మెంట్ లో ఆయ‌న ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డ్డాడు. అక్క‌డ‌కు చేరుకున్న పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ఆయ‌న మృత‌దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఆయ‌న మృతిపై ఎన్నో అనుమానాలు వ్య‌క్తమ‌వుతున్న వేళ ప్రదీప్ భార్య పావ‌ని రెడ్డి మీడియాతో మాట్లాడారు. త‌మ‌కు ఎటువంటి ఆర్థిక స‌మ‌స్య‌లు లేవని, నిన్న రాత్రి మాత్రం చిన్న‌ గొడ‌వ పెట్టుకున్నామ‌ని చెప్పారు. ఆ స‌మ‌యంలో ప్ర‌దీప్‌ కొంత తాగి ఉన్నాడని చెప్పారు. ఆయ‌నంటే త‌న‌కు చాలా ఇష్టమ‌ని ఆమె తెలిపారు. ఆయ‌న ఆత్మ‌హ‌త్య చేసుకుంటాడ‌ని తాను అస్సలు అనుకోలేద‌ని తెలిపారు.

త‌న‌తో ప్ర‌దీప్ ఎల్ల‌ప్పుడూ ‘నేను లేక‌పోతే నువ్వు బ‌త‌క‌లేవు’ అని అంటాడని పావని తెలిపారు. తాను ఏడిస్తే త‌న భ‌ర్త‌ చూడ‌లేక‌పోయేవార‌ని వ్యాఖ్యానించారు. ప్ర‌దీప్ వాళ్ల త‌ల్లి, సోద‌రులు చెన్నైలో ఉంటారని తెలిపారు. క్ష‌ణికావేశంలో ప్ర‌దీప్‌ ఇటువంటి నిర్ణ‌యం తీసుకొని ఉండ‌వ‌చ్చని, ఆత్మహత్య చేసుకునేంత గొడ‌వ‌లు త‌మ మ‌ధ్య‌ ఏమీ లేవని చెప్పారు. చిన్న చిన్న గొడ‌వ‌లు ఉన్నాయ‌ని, అయితే, చిన్న గొడ‌వ‌కే ఆత్మ‌హ‌త్య ఎందుకు చేసుకున్నాడో అర్థం కావ‌ట్లేద‌ని తెలిపారు. తాము ప్రేమించి పెళ్లి చేసుకున్నామ‌ని అన్నారు.

త‌మ‌కు ఏ రోజూ ఏ ప్రాబ్లం రాలేదని పావని చెప్పారు. ఒక‌రిపై ఒక‌రికి ఎటువంటి అనుమానాలు లేవని అన్నారు. తాము ఇద్ద‌రం షూటింగ్‌ల‌లో పాల్గొంటూ ఉంటామ‌ని చెప్పారు. నిన్న‌ రాత్రి పార్టీ చేసుకున్నాక‌, ఆయ‌న వెళ్లి రూంలో ప‌డుకున్నాడ‌నుకున్నాన‌ని, అయితే, రూంలోకి వెళ్లిన త‌న భ‌ర్త‌ లోపల డోర్ లాక్ చేసుకొన్నాడ‌ని తెలిపారు. కాసేప‌టికి డోర్ కొట్టానని, ఫోన్ చేశానని, అయినా రూంలోని త‌న భ‌ర్త నుంచి స్పందన రాలేదని, దీంతో త‌న సోద‌రుడి సాయంతో తలుపులు బద్దలు కొట్టామ‌ని తెలిపారు. అనంత‌రం అంబులెన్స్‌కి కూడా కాల్ చేశామ‌ని అన్నారు. ఈ విష‌యం తెలుసుకున్న‌ ప్ర‌దీప్ వాళ్ల ఫ్యామిలీ చెన్నై నుంచి ఇక్క‌డ‌కు వ‌స్తున్నారని పావ‌ని తెలిపారు.

  • Loading...

More Telugu News