: ట్రంప్ కు చీర కట్టుతో నిరసన తెలుపుతున్న అమెరికా అమ్మాయి..!
అమెరికాలో జాత్యహంకారం పెచ్చుమీరుతున్న తరుణంలో భారతీయులకు అండగా... భారతీయ వస్త్రధారణతో మద్దతు తెలుపుతోందో అమెరికా అతివ. డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలకు ఆమె వివిధ రకాల చేనేత చీరలతో నిరసన తెలుపుతోంది. చీరల విశిష్టత తెలుపుతూనే... ఆమె సామాజిక మాధ్యం ద్వారా చేస్తున్న పోరాటం అభినందనీయం అని పలువురు భారతీయులు ప్రశంసిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోకి షికాగోకు చెందిన స్టేసీ జాకబ్ 2015లో భారతదేశం వచ్చింది. చెన్నైలోని చేనేత వస్త్ర దుకాణాన్ని సందర్శించింది. అప్పుడే ఆమె చేనేత చీరలతో ప్రేమలో పడిపోయింది. అప్పటి నుంచి చేనేత చీరలకు, ఆమెకు మధ్య విడదీయలేని అనుబంధం ఏర్పడింది. అయితే, ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా తీసుకుంటున్న నిర్ణయాలు ఆమెకు నచ్చలేదు. దీంతో చీరకట్టుతో ఆమె తన నిరసన తెలియజేస్తోంది.
ట్రంప్ తీసుకుంటున్న ఒక్కో నిర్ణయానికి ఒక్కోరకమైన చీరను ధరిస్తూ ఆమె నిరసన తెలియజేస్తోంది. అంతే కాదు ఆమె కట్టిన చీర భారత్ లోని ఏ ప్రాంతంలో తయారు చేసింది, ఆ ప్రాంతం దేనికి ప్రసిద్ధి వంటి వివరాలను కూడా ఆమె తన ఇన్ స్టా గ్రాంలో పోస్టు చేస్తుండడం విశేషం. స్త్రీల పట్ల ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఆమె, ట్రంప్ కు ఘాటుగా తన ఇన్ స్టా గ్రామ్ లో సమాధానం చెప్పింది. 'నువ్వు నా శరీరంలో పట్టుకోవాలనుకుంటున్న ప్రాంతాన్ని ముట్టుకోలేవు... ఎందుకంటే అది ఆరు గజాల వస్త్రంతో కప్పబడి ఉంది కనుక' అంటూ సమాధానమిచ్చింది.
అలాగే తుంటరి అమెరికన్లను ఉద్దేశించి...'నేను చీరకట్టులో ఉన్నాను....నా శరీర కొలతలు నీకు అంతుబట్టవు...తీక్షణంగా చూసినా ప్రయోజనం లేదు' అంటూ చీర గొప్పతనాన్ని పోస్టు చేసింది...అలాగే ముస్లిం దేశాలపై బ్యాన్ విధించిన సమయంలో...'బోర్డర్లు చీరకు ఉంటాయి... దేశాలు, ప్రజలకు కాదు' అంటూ సూటిగా సమాధానం చెప్పింది. భారతీయులపై ట్రంప్ నిషేధం విధిస్తే....తాను కూడా భారతీయురాలినేనని, తనను కూడా నిషేధించి చూపాలని సవాలు విసురుతోంది. ఆమె ఇన్ స్టా గ్రాం నిండా చేనేత చీరకట్టుతో నిండిన ఫోటోలు కనువిందు చేస్తాయి...చీరకట్టుతో పాటు, ఆసక్తికర కథనాలు కూడా ఆకట్టుకుంటాయి. స్టేసీ జాకబ్ ఇన్ స్టా గ్రాంకు విశేషమైన అభిమానులు ఏర్పడుతున్నారు.