: దళితుడు తన కుమార్తె వివాహం ఘనంగా చేశాడని... మంచినీటి బావిలో కిరోసిన్ కలిపిన అగ్రవర్ణాలు!
స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లైనా వర్ణ వివక్ష అంతం కావడం లేదు. తన కుమార్తెకు ఓ దళితుడు ఘనంగా వివాహం చేశాడన్న అక్కసుతో దళితులు ఉపయోగించే మంచినీటి బావిలో కిరోసిన్ కలిపిన దుశ్చర్య మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... మధ్యప్రదేశ్ లోని మానాలో దళితుడైన మేఘావాల్ (47) తన కుమార్తెకు వివాహం ఘనంగా జరపాలని భావించాడు. దీంతో వివాహం సందర్భంగా బ్యాండ్ మేళం ఏర్పాటు చేశాడు. దీంతో గ్రామంలోని అగ్రవర్ణాలకు ఆగ్రహం కలిగింది. బ్యాండ్ మేళం పెట్టవద్దని హెచ్చరించారు. తమ ఆదేశాలు ధిక్కరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
దీంతో పోలీసులను ఆశ్రయించిన మేఘవాల్ వారి సహకారంతో వివాహాన్ని ఘనంగా నిర్వహించాడు. దీంతో ఆగ్రహానికి గురైన అగ్రవర్ణ పెద్దలు... గ్రామంలో దళితులంతా తాగేందుకు వినియోగించే మంచినీటి బావిలో కిరోసిన్ ను కలిపారు. దీంతో దళితులంతా కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఆ నీటిని పరిశీలించిన అధికారులు...బావిలో నీటిని మోటారుతో తోడించి, వినియోగానికి అవసరమైన విధంగా బావిని శుభ్రం చేయించారు. బావి కావడం వల్ల అగ్రవర్ణాలు ఇలా చేయగలిగాయని... భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు జరగకుండా బోర్లు వేయిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.