: పాక్ రేంజర్ల అమానుష చర్య పట్ల భారత రక్షణ శాఖ మంత్రి ఆగ్రహం... మూల్యం తప్పదని హెచ్చరించిన జైట్లీ
జమ్ముకశ్మీర్ పూంఛ్ జిల్లాలోని కృష్ణఘాటి సెక్టార్ నియంత్రణ రేఖ వద్ద మరోసారి దాడి జరిపిన పాకిస్థాన్ రేంజర్లు ఇద్దరు భారత జవాన్ల ప్రాణాలు తీసి, అనంతరం ఆ జవాన్ల మృతదేహాలను అతికిరాతకంగా ముక్కలు ముక్కలుగా నరికేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన భారత ఆర్మీ ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరిక చేసింది.
ఈ క్రమంలో దీనిపై స్పందించిన కేంద్ర ఆర్థిక, రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఘాటుగా హెచ్చరికలు జారీ చేశారు. పాకిస్థాన్ రేంజర్లు భారత ఆర్మీని చంపి, వారి దేహాలను ముక్కలు ముక్కలుగా నరకడం అటవిక చర్య అని ఆయన అన్నారు. భారత జవాన్ల త్యాగాలు వృథాకావని ఆయన వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ చర్యను భారత సర్కారు తీవ్రంగా ఖండిస్తోందని, భారత్ ఆర్మీ తగిన సమయంలో బుద్ధి చెబుతుందని ఆయన తేల్చి చెప్పారు.