: బీహార్ లో బాంబు దాడి నుంచి తృటిలో తప్పించుకున్న మహిళా ఎంపీ!
బీహార్ కు చెందిన మహిళా ఎంపీ కహకషాన్ పర్వీన్ ఓ బాంబు దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం విషయమై నిన్న రాత్రి భగల్ పూర్ లోని తన నివాసంలో కార్యకర్తలతో ఆమె మాట్లాడుతున్న సమయంలో ఈ దాడి జరిగింది.
ఈ సందర్భంగా భగల్ పూర్ పోలీసు అధికారి మనోజ్ కుమార్ మాట్లాడుతూ, జేడీ(యూ) నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న కహకషాన్ పర్వీన్ తన నివాసంలో కార్యకర్తలతో మాట్లాడుతున్న సయమంలో కరెంట్ పోయిందని, ఇదే అదనుగా భావించిన దుండగులు ఆమె పైకి బాంబులు విసిరారని, అయితే, ఆమెకు కొద్ది దూరంలో అవి పడటంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పారు. భూ తగాదాల కారణంగానే ఈ దాడి జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కాగా, ఈ దాడిలో ఆరుగురు గాయపడ్డారని, అందులో, ఎంపీ పర్వీన్ తండ్రి కూడా ఉన్నారని తెలిపారు.