: సంచలన నిర్ణయం... సమాజ్ వాదీకి విడాకులిచ్చేసిన కాంగ్రెస్!


ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా విఫలమైన, ప్రజలు మెచ్చని జోడీగా మిగిలిపోయిన సమాజ్ వాదీ, కాంగ్రెస్ పార్టీలు తమ బంధాన్ని తెంచుకున్నాయి. "జనం మెప్పును పొందలేని జంటకు విడాకులే దారి. సమాజ్ వాదీతో పొత్తును తెంచుకుంటున్నాం" అని లక్నోలో జరిగిన యూపీ కాంగ్రెస్ కమిటీ సమావేశం తరువాత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాజ్ బబ్బర్ ఓ ప్రకటన చేశారు. కొద్దిసేపటి క్రితం ఆయన మీడియాతో మాట్లాడుతూ, యూపీ స్థానిక సంస్థలకు జరిగే ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీకి దిగనుందని అన్నారు.

 రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ గులామ్ నబీ ఆజాద్ సహా పలువురు నేతల అభిప్రాయాల మేరకు వారి సమక్షంలోనే పొత్తు బంధాన్ని రద్దు చేసుకోవాలన్న నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. సమాజ్ వాదీతో పొత్తు వల్ల తమ పార్టీ సైతం ఘోరంగా నష్టపోయిందని నేతలు అభిప్రాయపడ్డారని ఈ సందర్భంగా రాజ్ బబ్బర్ పేర్కొన్నారు. ఇకపై రాహుల్ గాంధీ సూచించిన '3కే' ఫార్ములా (కార్యకర్త, కార్యాలయం, కార్యక్రమం)తో గోడకు కొట్టిన బంతాలా దూసుకొచ్చి పార్టీకి పునర్వైభవం సాధించి తీరుతామని నేతలంతా ప్రతిజ్ఞ చేసినట్టు వెల్లడించారు.

  • Loading...

More Telugu News