: ఏపీ, తెలంగాణల మధ్య మళ్లీ రగడ... నాగార్జున సాగర్ వద్ద ఉద్రిక్తత
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య నాగార్జున సాగర్ నీటి విడుదల విషయంలో విభేదాలు రావడంతో ఉద్రిక్తత నెలకొంది. సాగర్ కుడి కాలువ ద్వారా ఏపీ అధికారులు నీటిని విడుదల చేయగా, దాన్ని తెలంగాణ అధికారులు అడ్డుకున్నారు. జలాశయంలో తమకు రావాల్సిన వాటా పూర్తి కాకుండా, ఏపీకి నీటిని ఎలా తీసుకువెళతారని వారు నిలదీశారు. వేసవిలో తాగునీటి అవసరాలకు మాత్రమే నీటిని విడుదల చేస్తున్నామని ఏపీ అధికారులు చెప్పినా వినలేదు. ఈ నేపథ్యంలో వాగ్వాదం పెరిగి ఉద్రిక్తత నెలకొనడంతో, ఏపీ అధికారులకు రక్షణగా ఏపీ పోలీసులు, తెలంగాణ అధికారులకు రక్షణగా తెలంగాణ పోలీసులు మోహరించారు. దీంతో డ్యాం వద్ద వాతావరణం వేడెక్కింది.