: పెళ్లికి ముందే మాటతప్పాడని పెళ్లికి నిరాకరించిన వధువు...పోలీసులు హామీ ఇస్తే కానీ పెళ్లాడలేదు!
పెళ్లికి ముందే మాటతప్పాడని ఆరోపించిన వధువు పెళ్లికి నిరాకరించింది. చివరకు పోలీసులు హామీ ఇస్తే కానీ అతనిని పెళ్లాడని ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే... యూపీలోని ఫిరోజాబాద్ పట్టణంలో దాఖల్ ప్రాంతంలోని యువకుడితో యువతికి పెళ్లి నిర్ణయించారు. ముహూర్తం సమయానికి పెళ్లికొడుకు ఇస్తానన్న నగలను పెళ్లి కుమార్తెకు బహూకరించాడు. అనంతరం వాటిని ధరించిన యువతి, తాళికట్టే సమయానికి ఆ నగలు గిల్టు నగలని గుర్తించింది.
దీంతో పెళ్లి వేదికపై నుంచి దిగి, తనను మోసం చేసిన వాడిని పెళ్లాడనని తెగేసి చెప్పేసింది. దీంతో అవాక్కైన వరుడు గిల్టు నగలు ఎందుకు ఇచ్చాడో వివరించాడు. అయినా యువతి ససేమిరా అనడంతో ఈ వివాదం పోలీస్ స్టేషన్ చేరింది. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులకు, దొంగల భయంతో తాము గిల్టునగలు ఇచ్చామని, వివాహానంతరం ఆమెకు బంగారు నగలు ఇస్తామని పెళ్లికొడుకు తరఫు వారు హామీ ఇచ్చారు. దీంతో పోలీసులు వధువుకు సర్దిచెప్పడంతో ఎట్టకేలకు వివాహానికి అంగీకరించింది. దీంతో పోలీసుల సహకారంతో ఆ వివాహ తంతు పూర్తైంది.