: పొట్టి డ్రెస్సుతో వచ్చి ప్రత్యర్థిని రెచ్చగొడుతోందని ఆరోపిస్తూ, చెస్ టోర్నీ నుంచి చాంపియన్ గెంటివేత!
మలేషియాలో యువత మధ్య చెస్ టోర్నమెంటు జరుగుతుండగా, ఓ 12 ఏళ్ల చెస్ చాంపియన్, మోకాళ్లకు పైగా ఉన్న కురచ దుస్తులు ధరించి వచ్చి ప్రత్యర్థిని రెచ్చగొట్టి, మ్యాచ్ గెలవాలని చూస్తోందని ఆరోపించిన టోర్నీ నిర్వాహకులు ఆమెను పోటీల నుంచి తొలగించిన ఘటన కలకలం రేపింది. మలేషియాలో నేషనల్ స్కూలాస్టిక్ చెస్ చాంపియన్ షిప్ మూడు రోజుల పాటు జరుగగా, తాను కోచింగ్ ఇస్తున్న బాలిక, ఇతరులను ఆకర్షించేలా దుస్తులు ధరించిందని ఆరోపిస్తూ తొలగించారని చెస్ కోచ్ కౌషల్ ఖాందార్ ఆరోపించారు. ఇది అత్యంత హేయమైన ఘటనని ఆయన అభివర్ణించారు.
ఎఫ్ఐడీఈ నిబంధనల్లో డ్రెస్ కోడ్ అంటూ ఏమీ ఉండదని గుర్తు చేశారు. ఇరాన్ తదితర ముస్లిం మెజారిటీ దేశాల్లో అక్కడి సంప్రదాయాల ప్రకారం, నిండైన దుస్తులను యువతులు ధరించాల్సి వుంటుంది. మలేషియాలో మాత్రం ముస్లిం నిబంధనలను అమ్మాయిలు పెద్దగా పాటించే పరిస్థితి కనిపించదు. పొట్టి దుస్తులు, మోకాళ్లకు పైగా ఉండే గౌన్లతో ఇక్కడి అమ్మాయిలు పబ్లిక్ ప్లేసుల్లో తిరగడం సర్వ సాధారణం. తాను ఇరవై సంవత్సరాలుగా చెస్ టోర్నమెంటుల్లో పాల్గొంటున్నానని, ఎందరికో శిక్షణ ఇచ్చి పోటీలకు పంపానని, ఈ తరహా ఘటన, గెంటివేతను ఎన్నడూ చూడలేదని ఖాందార్ వాపోయారు.