: కుమారుడి పెళ్లి చూపులకు వెళ్లి వస్తుండగా యాక్సిడెంట్... బీజేపీ నేత చెంగల్రాయ మృతి, కుమారుడికి తీవ్రగాయాలు
కొడుకు పెళ్లి చూపుల నిమిత్తం బెంగళూరుకు వెళ్లి వస్తుండగా, జరిగిన రోడ్డు ప్రమాదంలో చిత్తూరు జిల్లా బీజేపీ నేత, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మందడి చెంగల్రాయ మరణించగా, ఆయన కుమారుడు రవికుమార్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. స్కార్పియో వాహనంలో బెంగళూరు నుంచి చిత్తూరుకు వస్తుండగా, గంగవరం మండలం ఉగిని వద్ద, తిరుపతి నుంచి బెంగళూరు వెళుతున్న కేఎస్ ఆర్టీసీ బస్సు వీరి వాహనాన్ని బలంగా డీకొంది.
దీంతో కారులో ఉన్న చెంగల్రాయ అక్కడికక్కడే మరణించారు. కారులోనే ఉన్న వీరి బంధువు మురళి, డ్రైవర్ హరికృష్ణలకు ప్రాణాపాయం తప్పింది. వెంటనే 108 సహకారంతో రవికుమార్ ను పలమనేరు ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో వేలూరులోని సీఎంసీకి తరలించి చికిత్సను అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, విచారణ ప్రారంభించారు.