: రేషన్‌కు బదులు నగదు కావాలంటే కూడా ఇస్తాం: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు పశ్చిమగోదావరి జిల్లాలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను చేపడుతోందని చెప్పారు. రేషన్‌కు బదులు నగదు కావాలంటే కూడా ఇస్తామని చంద్రబాబు అన్నారు. ఏపీలో తమ ప్రభుత్వం ఇంకా 60 లక్షల మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉందని చెప్పారు. 2018 నాటికి ఏపీని బహిరంగ మలవిసర్జనరహిత రాష్ట్రంగా చేస్తామని అన్నారు.
రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని సాగుకు 7 గంటల విద్యుత్ అందజేస్తుందని సీఎం తెలిపారు. ఏపీలో 47 లక్షల మందికి రూ.వెయ్యి చొప్పున పింఛను ఇస్తున్నామని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పరిశ్రమలు రాకుండా కొందరు అడ్డుపడుతున్నారని అన్నారు. తాను కాలుష్యం అంశాన్ని దృష్టిలో పెట్టుకొనే ముందుకు వెళుతున్నానని, అది పెరగడాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోనని అన్నారు. ఏపీలో వందశాతం వంటగ్యాస్ కనెక్షన్లు ఉన్న జిల్లా పశ్చిమగోదావరేనని అన్నారు.