: బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలిసిపోయింది.... ఇప్పుడు కొత్త అనుమానం మొలకెత్తింది!
బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? రెండేళ్లపాటు వేధించిన ఈ ప్రశ్నకు సమాధానం నిన్నటితో తెలిసిపోయింది. ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునేందుకు సినీ అభిమానులు విపరీతమైన ఉత్సాహం చూపించడంతో 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' విడుదలైన తొలిరోజు రికార్డు స్థాయిలో వసూళ్లు నమోదయ్యాయి. ఇదిలా ఉంచితే, 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' చూసిన అభిమానుల్లో కొత్త అనుమానం మొలకెత్తింది.
'బాహుబలి-2: ద బిగెనింగ్' లో అమరేంద్ర బాహుబలి కుమారుడు శివుడు... తన తల్లి దేవసేనను రాజకోట నుంచి తప్పించి తీసుకొస్తూ....భల్లాల దేవుడి కుమారుడు భద్రుడిని నరికి చంపేస్తాడు. అప్పుడు శివుడు.. అమరేంద్ర బాహుబలి కుమారుడని తెలుస్తుంది. ఈ భద్రుడి పాత్రలో అడివి శేష్ నటించాడు. అయితే 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' సినిమాలో భల్లాల దేవుడు (రానా) కు వివాహం జరిగినట్టు చూపించలేదు. భల్లాలదేవుడి కుట్ర, అమరేంద్ర బాహుబలి ప్రేమ, వివాహం చుట్టూ కథ తిరుగుతుంది. అయితే అసలు పెళ్లే కాని భల్లాల దేవుడికి కుమారుడు ఎలా వచ్చాడు? అన్నది చూపించలేదు. మాహిష్మతి రాజు భల్లాలదేవుడు పెళ్లి చేసుకుని భద్రడిని కన్నాడా? లేక అంతఃపుర కాంతతో కాలుజారాడా? అన్న అనుమానం సోషల్ మీడియాలో వ్యక్తమవుతోంది.