: జయలలిత మాజీ డ్రైవర్ మృతి.. అనుమానం వ్యక్తం చేస్తున్న జయ మద్దతుదారులు
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మాజీ డ్రైవర్ కనకరాజు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సాలెం జిల్లాలోని అత్తూర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈయన ప్రాణాలు కోల్పోయాడు. అయితే, కనకరాజుది ముమ్మాటికే హత్యేనని జయలలిత మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. జయకు చెందిన కడనాడు ఎస్టేట్ లో ఇటేవలే అక్కడి సెక్యూరిటీ గార్డు హత్యకు గురయ్యాడు. ఈ హత్య వెనుక కనకరాజు హస్తం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఇంతలోనే ఆయన రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో, కేసు కీలక మలుపు తిరిగినట్టైంది.
జయలలిత బతికున్న సమయంలో కనకరాజుపై ఆరోపణలు ఉన్నాయి. ఆమె పేరును కనకరాజు దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. ఈ నేపథ్యంలో, ఈయనను 2012లో జయ ఉద్యోగం నుంచి తొలగించారు. ఆ తర్వాత కోయంబత్తూరులోని ఓ బేకరీలో పని చేశాడు.
ఈ క్రమంలో, త్రిశూర్ కు చెందిన సయన్ అనే వ్యక్తితో చేతులు కలిపి, కొడనాడ్ ఎస్టేట్ ను దోచుకునేందుకు కనకరాజు పథకం పన్నినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే, కొడనాడ్ ఎస్టేట్ లోకి ఏప్రిల్ 24న చొరబడి... అక్కడున్న సెక్యూరిటీ గార్డును హతమార్చి ఉంటారనేది పోలీసుల అనుమానం. ఈ నేపథ్యంలో కనకరాజు కోసం పోలీసులు గాలింపు ప్రారంభించారు. ఇంతలోనే, ఆయన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఈ మృతి పట్ల జయ మద్దతుదారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.