: హుస్సేన్ సాగర్ లోకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించిన ఐదుగుర్ని కాపాడిన పోలీసులు


వివిధ కారణాలతో హైదరాబాదులోని హుస్సేన్ సాగర్ లో దూకి ప్రాణాలు తీసుకుందామని భావించిన ఐదుగురిని లేక్ పోలీసులు కాపాడడం జరిగింది. ఒకేరోజు ఐదుగురు ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే... పార్శీగుట్టకు చెందిన బి.సతీష్‌ (26) మద్యంతాగి ఇంటికి వెళ్లాడు. దీంతో అతని తల్లి, సోదరుడు తీవ్రంగా మందలించారు. భవిష్యత్ బూడిదైపోతుందని హెచ్చరించారు. దీంతో మనస్తాపానికి గురైన సతీష్ ఆత్మహత్య చేసుకునేందుకు హుస్సేన్ సాగర్ కు చేరాడు.

ఆ తరువాత హబ్సిగూడ ప్రాంత గృహిణి ఎస్‌.ఊర్మిళ (43) భర్త నుంచి విడాకులు తీసుకుని పిల్లలతో కలసి ఉంటోంది. ఈ క్రమంలో ఆమె గురువారం రాత్రి కజిన్‌ తో గొడవపడింది. ఈ క్రమంలో మానసిక సంఘర్షణకు గురైన ఆమె ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయంతో హుస్సేన్ సాగర్ చేరింది. ఆబిడ్స్‌ లోని చిరాగ్‌ లైన్‌ ప్రాంతానికి చెందిన యువకుడు హఫీజ్‌ (24) మానసిక రుగ్మతకు చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో ఇంటి నుంచి పారిపోయి ట్యాంక్‌ బండ్‌ చేరాడు.

అలాగే తిరుమలగిరి ఆర్టీసీ కాలనీకు చెందిన ఎం.కె.సంధ్య (36) భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండడడం భరించలేకపోయింది. ఈ విషయంలో భర్తను నిలదీసినా ఉపయోగం లేకుండా పోయింది. భర్త నుంచి ఆదరణ లేదన్న ఆవేదనతో ఆమె ఆత్మహత్య చేసుకోవాలని భావించి హుస్సేన్ సాగర్ చేరుకుంది. కుషాయిగూడకు చెందిన బి.షైనే (21) నిత్యం భర్త మద్యం మత్తులో ఇంటికి చేరడంతో విసిగిపోయి గొడవపడింది. ఈ క్రమంలో ఇక ఈ వేదన భరించే కంటే చావే మేలని భావించి హుస్సేన్ సాగర్ చేరింది.

అదే సమయంలో అక్కడ విధులు నిర్వర్తిస్తున్న లేక్‌ పోలీస్‌ స్టేషన్‌ బ్లూకోట్స్‌ కానిస్టేబుల్స్‌ ఎన్‌.శ్రీనివాస్‌, సి.సాయికిరణ్‌, ఫజల్‌ అహ్మద్‌ ఖాన్‌, బి.నీర్జూ, ఇస్మాయిల్‌ బిన్‌ సలామ్‌, హోంగార్డు పి.వెంకట్రావు, డి.రవి. జీవన్‌ వీరిని గమనించారు. వేగంగా స్పందించి వారికి సర్దిచెప్పి, స్టేషన్ కు తీసుకెళ్లారు. అక్కడ స్టేషన్ ఇన్‌ స్పెక్టర్‌ కె.శ్రీదేవి కౌన్సెలింగ్‌ ఇచ్చి, వారిని బంధువులకు అప్పగించారు.

  • Loading...

More Telugu News