: రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలకు ఇదే కారణం: యేల్ యూనివర్సిటీ పరిశోధకులు
ప్రపంచ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ప్రధానంగా మనదేశంలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితి ప్రపంచం అంతటా ఉందని అమెరికాలోని కనెక్టికిట్ లో ఉన్న యేల్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. అంతే కాకుండా, అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరాల జాబితాలో 2017 కూడా చేరుతుందని వారు వెల్లడించారు. ప్రపంచ వాతావరణ పరిస్థితులపై పరిశోధనలు నిర్వహిస్తున్న యేల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు... ఎల్నినో ప్రభావం బలహీనపడడమే ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణమని అన్నారు. 1980 నుంచి 90 దశకం వరకు బలమైన ఎల్నినోలు చోటుచేసుకున్నాయని వారు వెల్లడించారు. ఆ తరువాతి కాలంలో అవి బలహీనపడ్డప్పటికీ వాటి ప్రభావం బలంగా ఉందని వారు చెప్పారు. 1998 నుంచి 2013 వరకు భూతాపంలో ఏర్పడ్డ స్వల్ప విరామమే ఈ ఏడాది ఉష్ణోగ్రతలు మరింత పెరగడానికి కారణమని వారు పేర్కొన్నారు.