: మీ కన్నీళ్లు తుడిచేందుకు మేమొస్తాం.. అధికారంలోకి వస్తే తొలి సంతకం దానిపైనే!: టీడీపీ ప్రజాపోరు సభలో రేవంత్ రెడ్డి


రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సిన పనిలేదని, తాము అధికారంలోకి వస్తే వారి కన్నీళ్లు తాము తుడుస్తామని టీడీపీ-టీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి రైతులకు భరోసా ఇచ్చారు. వికారాబాద్ జిల్లాలోని తాండూరులో నిర్వహించిన టీడీపీ ప్రజాపోరు సభలో ఆయన మాట్లాడుతూ తాండూరు సభను రైతులకు అంకితమిస్తున్నట్టు తెలిపారు. పంటలు ఎండి, గిట్టుబాటు ధర లేక, పెట్టుబడుల కోసం తీసుకున్న సొమ్ముకు వడ్డీలు కట్టలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు 3 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు.

వరంగల్‌లో నిర్వహించిన సభలో కేసీఆర్ రైతుల గురించి ఒక్కమాట కూడా మాట్లాడలేదని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే అన్ని పంటలకు గిట్టుబాట ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. రైతాంగానికి బడ్జెట్‌లో టీడీపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, రూ.25 వేల కోట్లు కేటాయిస్తూ తొలి సంతకం చేస్తామని తెలిపారు. అలాగే కులవృత్తులు, నిరుద్యోగులు, విద్యార్థుల కోసం ప్రత్యేక మేనిఫెస్టో ప్రకటిస్తామన్నారు. తాము అధికారంలోకి వస్తే మహిళల రుణాలను మాఫీ చేస్తామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌. రమణ హామీ ఇచ్చారు. టీడీపీ ప్రజా పోరు సభలో పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖరరెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, అధికార ప్రతినిధి అరవింద్ కుమార్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి సీతక్క తదితరులు పాల్గొన్నారు.  ప్రజాపోరు సభ విజయవంతం కావడంతో టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.

  • Loading...

More Telugu News