: తీవ్ర మానసిక ఒత్తిడిలో శశికళ.. క్షీణిస్తున్న ఆరోగ్యం.. ఆస్తులను తమ పేర రాసేయాలంటూ బంధువుల ఒత్తిడి!
అక్రమాస్తుల కేసులో దోషిగా తేలి బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ తీవ్ర మానసిక వేదనలో కూరుకుపోయినట్టు సమాచారం. జైలులో ఉన్న 75 రోజుల్లోనే ఆమె 15 కిలోలకుపైగా బరువు తగ్గినట్టు తెలుస్తోంది. ఆమె చక్కెర స్థాయులు కూడా 440కి పెరిగినట్టు సమాచారం. మరదలు ఇళవరసి, అక్క కొడుకు సుధాకరన్‌లతో కలిసి శిక్ష అనుభవిస్తున్న ఆమె జైలుకొచ్చిన బంధువులను కలిసేందుకు విముఖత చూపిస్తున్నారు. తనను కలిసేందుకు వచ్చినవారు తన బాగోగులు అడగకుండా ఆస్తులను తమ పేరు మీద రాయాలని ఒత్తిడి తీసుకొస్తుండడంతో వారిని కలిసేందుకు శశికళ ఇష్టపడడం లేదని ఆమె సన్నిహిత నేత ఒకరు తెలిపారు. తన పేరిట ఉన్న ఆస్తులు, బినామీ ఆస్తుల గురించి బంధువులు ఆరా తీస్తుండడంతో శశికళ డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారని ఆయన పేర్కొన్నారు.
భగవంతుడు జయలలితతోపాటు తనను కూడా ఎందుకు తీసుకెళ్లలేదంటూ ఒకానొక సమయంలో ఆమె పెద్దపెట్టున రోదించారని జైలు వర్గాలు అన్నాడీఎంకే నేతలకు చెప్పినట్టు సమాచారం. దీనికి తోడు అన్నాడీఎంకేలో నెలకొన్న ప్రస్తుత పరిణామాలు కూడా ఆమెను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. అధికారికంగా ప్రకటించనప్పటికీ అన్నాడీఎంకే నేతలు పార్టీ నుంచి ఆమెను దూరంగా ఉంచడం కూడా ఆమె మనస్తాపానికి ఒక కారణమని చెబుతున్నారు. ఈ పరిణామాల కారణంగానే శరీరంలో ఆమె చక్కెర స్థాయులు పెరిగినట్టు చెబుతున్నారు.