: బంగారంపై భారీ డిస్కౌంట్లు ప్రకటించిన ఫ్లిప్ కార్ట్, అమెజాన్... ఇంకా ఎన్నో కంపెనీలు!
అక్షయ తృతీయ నేపథ్యంలో బంగారం అమ్మకాలు ఊపందుకుంటాయన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బంగారం దుకాణాలు వినియోగదారులకు డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇక, ఈ సారి బంగారం కొనుగోలుదారుల దృష్టంతా ఈ-కామర్స్ దిగ్గజాలయిన ఫ్లిప్ కార్ట్, అమెజాన్, స్నాప్ డీల్ వంటి సంస్థలపై పడింది. ఆయా సంస్థలు భారీ డిస్కౌంట్లను ప్రకటించడమే అందుకు కారణం. బంగారం, ప్లాటినం, డైమాండ్ జువెల్లరీలపై ఆయా కంపెనీలు డిస్కౌంట్లు ప్రకటిస్తూ వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ తమ వద్ద గోల్డ్ రింగ్, నెక్లెస్, చైన్, పెండెంట్స్, ఈయరింగ్ వంటి బంగారు ఆభరణాలపై 20 శాతం నుంచి 70 శాతం వరకు తగ్గింపు ఇవ్వనున్నట్టు పేర్కొంది.
అంతేగాక, యాక్సిస్ బ్యాంకు బుజ్ క్రెడిట్ కార్డు ఉపయోగిస్తూ మరో 5 శాతం డిస్కౌంట్ కూడా పొందవచ్చని చెప్పింది. ఇక అమెజాన్‌లోనూ ఉంచిన ఇటువంటి ఆఫర్లే వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. సెన్కో గోల్డ్, జోయల్కాస్, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, టీబీజడ్-ది ఒరిజినల్ వంటి బ్రాండులను ఆ సంస్థ విక్రయిస్తోంది. తమ వద్ద జువెల్లరీ కొనుగోలు చేసే ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డు దారులకు ఈ రోజు 5-20 శాతం డిస్కౌంటును ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ-కామర్స్ సంస్థ ఒర్రా కూడా బంగారం కాయిన్లకు, బార్స్ కు అక్షయ తృతీయ సందర్భంగా ఎలాంటి మేకింగ్ ఛార్జీలు వేయబోమని, మరో మూడు రోజుల పాటు ఆ ఆఫర్‌ను అందిస్తామని పేర్కొంది.
అంతేకాదు, వాహనతయారీ సంస్థలు కూడా తమ వాహనాలు కొనుగోలు చేస్తే బంగారాన్ని ఉచితంగా ఇస్తామని ప్రకటిస్తున్నాయి. ముంబయికి చెందిన వర్క్యూవల్ మార్కెట్ ప్లేస్.. ట్రూబిల్ డైరెక్ట్ నుంచి కారు బుక్ చేసుకున్న ప్రతి కస్టమర్ కి 24 క్యారెట్ల ఒక గ్రాము గోల్డ్ కాయిన్ ను ఫ్రీ గా అందిస్తోంది. తనిష్క్, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థలు కూడా ఇటువంటి ఆఫర్లనే ప్రకటించాయి. మరిన్ని వివరాలకు ఆయా కంపెనీల వెబ్‌సైట్ చూడవచ్చు.