: బాలీవుడ్ దర్శకుడి హత్యకు కుట్ర.. ముంబై మోడల్ కు జైలు శిక్ష!


ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత మధుర్ భండార్కర్ ను హత్య చేయించడానికి కుట్ర పన్నిన కేసులో ముంబై మోడల్ ప్రీతి జైన్ కు శిక్ష పడింది. ఈ కేసులో ప్రీతి జైన్ ను దోషిగా నిర్ధారించిన ముంబై కోర్టు, మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఆమెకు సాయపడ్డ నరేష్ పరదేశీ, శివరామ్ దాస్ లకు కూడా మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసుకు సంబంధించిన పూర్వాపరాలు.. 2005లో మధుర్ భండార్కర్ ను హత్య చేయించే నిమిత్తం గ్యాంగ్ స్టర్ అరుణ్ గావ్లీ అనుచరుడు నరేష్ పరదేశీతో ఒప్పందం చేసుకుని, అతనికి రూ.75 వేల రూపాయలు ఇచ్చింది.

 అయితే, భండార్కర్ ను హత్య చేయకపోవడంతో తన డబ్బులు వెనక్కి ఇవ్వాల్సిందిగా ప్రీతి డిమాండ్ చేసింది. ఈ విషయం అరుణ్ గావ్లీకి తెలియడంతో పోలీసులకు ఈ సమాచారాన్ని చేరవేశాడు. దీంతో, ప్రీతి, ఆమెకు సహకరించిన నరేష్, శివరామ్ లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ముగ్గురూ దోషులని కోర్టులో తేలడంతో శిక్ష పడింది. కాగా, 2006లో భండార్కర్ పై ప్రీతి రేప్ కేసు పెట్టింది. సినిమాల్లో అవకాశాలు ఇస్తానని చెప్పి తనను శారీరకంగా వాడుకున్నాడని ఫిర్యాదు చేసింది. అయితే, 2012లో ఈ ఫిర్యాదును ప్రీతి ఉపసంహరించుకోవడంతో ఆ కేసును కోర్టు కొట్టివేసింది.

  • Loading...

More Telugu News