: గొర్రెపిల్లలు, చేపపిల్లలు అంటూ హేళన చేశారు: సీఎం కేసీఆర్
రాష్ట్రంలోని యాదవ, గొల్ల, కురుమ సోదరుల కోసం తాము గొర్రెపిల్లలు, చేపపిల్లలను పంపిణీ చేయనున్నామని అసెంబ్లీలో ప్రకటించే వేళ ప్రతిపక్ష సభ్యులు తమను అవహేళన చేశారని సీఎం కేసీఆర్ అన్నారు. గొర్రెపిల్లలు, చేపపిల్లలు అంటూ వారు ఎద్దేవా చేస్తూ మాట్లాడుకున్నారని అన్నారు. ఆ సమయంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిపారు. యాదవ, గొల్ల, కురుమ వారికి సాయపడదామని తాము తీసుకొస్తున్న కార్యక్రమాలను అవమానించడమేంటని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో 84 లక్షల గొర్రెలను అందించనున్నామని ఆయన అన్నారు. ప్రజల కష్టాలు, బాధల నుంచి బయటపడడానికి వారి కులవృత్తులు లాభాల్లో ముందుకు వెళ్లాలని అన్నారు.
రాష్ట్రంలో 30 లక్షల మంది యాదవ, గొల్ల, కురుమ సోదరులు ఉన్నారని కేసీఆర్ అన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టం కావాలని కేసీఆర్ అన్నారు. తాము విజయవంతంగా జిల్లాల విభజన చేశామని, రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేకుండా చేశామని కేసీఆర్ అన్నారు. తాము ఈత, తాటి చెట్లు పెంచే కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నామని ఆయన అన్నారు.