: రాత్రంతా బంధించి... సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు!: ఢిల్లీ పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు


మహిళల రక్షణ విషయంలో ఢిల్లీ పరిస్థితుల్లో మార్పులు కనిపించడం లేదు. నిర్భయ ఘటన అనంతరం సామూహిక అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తూ ఆందోళన రేకెత్తిస్తున్నాయి. తాజాగా గుర్గావ్ కు చెందిన మహిళ సామూహిక అత్యాచారం జరిగిందని తన భర్తతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... గుర్గావ్ లో ఒక ప్రైవేటు సంస్థలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తున్న మహిళకు పరిచయమున్న కల్లూరామ్ అనే వ్యక్తి... మంచి ఉద్యోగం ఇప్పిస్తానని ఆశపెట్టాడు.

ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో కల్లురామ్ మంచి ఉద్యోగం ఉంది రమ్మని ఫోన్‌ చేసి, ఉన్నపళంగా మానేసార్ లోని ఐఎంటీ చౌక్‌ కు రావాలని సూచించాడు. దీంతో మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ఆమె, అతని మాటలు నమ్మి, గుర్గావ్ నుంచి మానేసార్‌ కు ఏడుగంటల ప్రాంతంలో చేరుకుంది. అక్కడ ఆమెను కలిసిన కల్లూరామ్, కాసేపట్లో సూపర్‌ వైజర్‌ వస్తాడని, అతను కంపెనీకి తీసుకెళ్తాడని చెప్పాడు.

దీంతో ఆమె ఎదురు చూస్తుండగా, బైక్ పై వచ్చిన ఒక వ్యక్తిని 'సూపర్ వైజర్' అంటూ పరిచయం చేసుకుని, తనను ఎక్కించుకున్నాడని తెలిపింది. అయితే తనను కంపెనీకి తీసుకెళ్లకుండా... బిలాస్‌ పూర్‌ కు సమీపంలోని శంకర్‌ కిదాని అనే గ్రామానికి తీసుకెళ్లాడని ఆమె తెలిపింది. అక్కడ ఇద్దరున్నారని ఆమె తెలిపింది. ఆ ముగ్గురూ కలిసి తనను బంధించారని, ఆ తరువాత మరోముగ్గురు వచ్చారని, కల్లూరామ్ తో కలిసి ఏడుగురు తనపై రాత్రంతా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె తెలిపింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.  

  • Loading...

More Telugu News