: అందంగా ఉండడంతో ఆఫీసులో అంతా ఆమెనే చూస్తున్నారని భార్య కన్ను పీకేసిన భర్త!
బెంగళూరులోని కొత్తనూరు పోలీస్ స్టేషన్ పరిధిలో బనశంకరి ప్రాంతంలో ఉన్న నాగేనహళ్లిలో గగుర్పాటుకు గురిచేసే ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే...ఒడిశాకు చెందిన మున్నా, రాధా దంపతులు 15 రోజుల క్రితం ఉపాధి కోసం బెంగళూరు వచ్చారు. నాగేనహళ్లిలోని ఓ ఇంట్లో అద్దెకు దిగిన ఈ దంపతులు దగ్గర్లోని ఒక ప్రైవేటు కంపెనీలో హౌస్ కీపింగ్ పనికి కుదిరారు.
అయితే ఆఫీసులోని వారంతా తన భార్యను నిత్యం చూస్తున్నారని, మాటకలిపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ విధులు ముగిసిన అనంతరం భార్యతో వాగ్వాదానికి దిగాడు. అనంతరం గొడవ సద్దుమణగడంతో నిద్రపోయారు. మళ్లీ బుధవారం ఉదయం ఇదే విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అందంగా ఉండడంతోనే ఆఫీసులో అంతా తన భార్యను చూస్తున్నారని, ఆమె అందవిహీనంగా ఉంటే ఎవరూ చూడరని చెబుతూ, భార్య కంటిని కత్తితో పీకేసి, అక్కడి నుంచి ఉడాయించాడు. ఆమె లబోదిబోమనడంతో స్థానికులు సంఘటనా స్థలికి చేరుకుని దగ్గర్లోని బాప్టిస్ట్ చర్చ్ ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న మున్నా కోసం గాలింపు చేపట్టారు.