: గెలుపు వెనుకే అంతర్మథనం... ఢిల్లీలో బీజేపీని కాదన్న ముస్లింలు... పోటీలో నిలిపిన వారంతా ఓటమి!
ఢిల్లీ మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి, ముచ్చటగా మూడో సారి ఢిల్లీ కార్పొరేషన్ ను కైవసం చేసుకుంది. ఇదే సమయంలో మూడు కార్పొరేషన్ల పరిధిలో, ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతంలో ఆ వర్గానికి చెందిన వారికే టికెట్లు ఇచ్చినప్పటికీ, వారంతా ఓటమి పాలవడం, బీజేపీలో అంతర్మథనానికి కారణమైంది. యూపీలో ముస్లిం ఓట్ల కారణంగానే ఘన విజయాన్ని సాధించిన బీజేపీ, ఢిల్లీ పరిధిలో మాత్రం ముస్లింలను ఆకట్టుకోలేక పోయిందని ఈ ఫలితాలు చాటి చెప్పాయి. మొత్తం ఆరుగురు ముస్లిం వ్యక్తులకు బీజేపీ టికెట్లివ్వగా, వారిలో ఒకరి నామినేషన్ చెల్లలేదు. మిగతా ఐదుగురూ ఓడిపోయారు. ఖురేష్ నగర్ లో సిట్టింగ్ కౌన్సిలర్ హూర్ బానో కుమార్తె రుబినా, జకీర్ నగర్ లో కున్వర్ రాఫీ, చౌహాన్ బంగర్ లో సత్రాజ్ అహ్మద్, ముస్తాఫాబాద్ లో సబ్రా మాలిక్, ఢిల్లీ గేట్ లో ఫైముద్దీన్ సైఫీలు ఓడిపోయారు. ముస్లింలు ఎక్కువగా నివాసం ఉన్న ప్రాంతాల్లో తమకు మద్దతు లభించకపోవడంపై సమీక్షిస్తున్నామని బీజేపీ వర్గాలు వెల్లడించాయి.