: హర్భజన్ ట్వీట్ ఎఫెక్ట్.. పైలట్ ఉద్యోగం ఊడింది!
‘జెట్ ఎయిర్ వేస్ పైలట్ బెర్నాడ్ హోస్టిన్.. తోటి ఇండియన్ ప్రయాణికుడిని ‘యూ బ్లడీ ఇండియన్ గెట్ అవుటాఫ్ మై ప్లైట్’ .. అంటూ దారుణంగా ప్రవర్తించాడని, జాత్యహంకారంతో ప్రవర్తించడమే కాకుండా, ఓ మహిళపై దాడికి కూడా పాల్పడ్డాడని .. అలానే, ఓ దివ్యాంగుడిని దుర్భాషలాడాడని.. అత్యంత అవమానకరంగా, సిగ్గు చేటుగా ప్రవర్తించాడని టీమిండియా క్రికెటర్ హర్భజన్ సింగ్ తన ట్విట్టర్ ద్వారా ఆరోపించిన సంగతి తెలిసిందే.
పైలట్ బెర్నాడ్ హోస్లిన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, తమ దేశంలో ఇటువంటివి సహించమని .. భారతీయుడిని అయినందుకు తాను గర్వపడుతున్నానని అంటూ హర్భజన్ సింగ్ వరుస ట్వీట్లలో తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విచారణకు ఆదేశిస్తున్నామని ప్రకటించిన జెట్ ఎయిర్ వేస్...ఈ ఘటనకు కారణమైన పైలట్ పై వేటు వేసింది. ఆయనపై ఆరోపణలు నిర్ధారణ కావడంతో ఆయనను విధుల నుంచి తొలగించినట్టు తెలిపింది. అంతే కాకుండా ఈ ఘటనలో బాధితులకు జెట్ ఎయిర్ వేస్ క్షమాపణలు కూడా చెప్పింది.