: 'బాహుబలి'కి ఐదేళ్లు పడుతుందని ముందుగానే తెలిస్తే అసలు చేసేవాడినే కాదు: రాజమౌళి


బాహుబ‌లి-2 విడుద‌ల‌కు సిద్ధ‌మైన నేప‌థ్యంలో ఆ సినిమా దర్శకుడు రాజమౌళి ఈ రోజు హైద‌రాబాద్‌లో మీడియాతో కాసేపు ముచ్చ‌టించి విలేక‌రులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పారు. గ్రాఫిక్స్ ప‌నులు ఉన్న‌ నేప‌థ్యంలో బాహుబ‌లి-2 సినిమా విడుద‌ల‌ను రెండు వారాలు వాయిదా వేద్దామా? అని తాను నిర్మాత శోభు యార్ల‌గ‌డ్డ‌ను అడిగానని చెప్పారు. కానీ అన్నీ టైమ్‌కి సెట్ అవుతాయని ఆయన చెప్పార‌ని అన్నారు.

 ఈ సినిమా కోసం ఐదున్నర నెలల స‌మ‌యాన్ని కంప్యూటర్ గ్రాఫిక్స్‌కే కేటాయించామ‌ని చెప్పారు. త‌మ‌కు చివ‌రి గ్రాఫిక్స్ షాట్ ఈ నెల 18వ తేదీన‌ వచ్చిందని చెప్పారు. బాహుబలి-2 అనేది బాహుబ‌లి-1 సీక్వెల్ కాదని, ఒక కథను ఒకే సినిమాలో చూపించ‌లేక‌ రెండు భాగాలుగా చూపించాల‌నుకున్నాన‌ని, అయితే, దానికి ఇంత సమయం పడుతుందని ఊహించలేదని రాజ‌మౌళి అన్నారు.

బాహుబ‌లి సినిమాకి ఐదేళ్ల స‌మ‌యం పడుతుంది అంటే అసలు చేసేవాడిని కాదని రాజమౌళి పేర్కొన్నారు. కానీ మొదలు పెట్టేసిన తరువాత సినిమాని మధ్యలో ఆపలేము కదా? అని ఆయ‌న అన్నారు. సినిమా టీమ్ అంతా కలిసి ఒకటిగా పని చేయడంతో సినిమా భారంగా అనిపించలేదని ఆయ‌న వ్యాఖ్యానించారు. బాహుబలిని క‌ట్ట‌ప్ప చంప‌డం అనే సీను ఇంత‌గా పాప్యుల‌ర్ అవుతుంద‌ని తాము ఊహించ‌లేద‌ని చెప్పారు.

బాహుబ‌లి-1 త‌రువాత బాహుబ‌లి 2 కోసం ఇంత గ్యాప్ వస్తుందని తాము కూడా అనుకోలేదని రాజ‌మౌళి అన్నారు. బాహుబ‌లి-1 విడుద‌లైన నాలుగు నెలల్లో పార్ట్ 2ని కూడా విడుదల చేయాలనుకున్నామ‌ని, కానీ అది సాధ్యం కాలేద‌ని అన్నారు. ద‌క్షిణ భార‌త‌ సినిమా అంటే బయట దేశాల్లో పెద్దగా తెలియదని, బాహుబలి ఇండియన్ సినిమా స్థాయిని పెంచిందని, వేరే దేశాల్లో తెలుగు సినిమా గురించి మాట్లాడుకుంటున్నార‌ని అన్నప్పుడు త‌న‌కు ఎంతో గర్వంగా అనిపిస్తుందని చెప్పారు. త‌న‌కు మహాభారతం సినిమా చేయాలనుందని, అయితే, ఆ సినిమా చేయడానికి మరో పదేళ్ల‌ అనుభవం అయినా త‌న‌కు కావాలని రాజ‌మౌళి అన్నారు.


  • Loading...

More Telugu News