: రైల్వేస్టేషన్లో ఇంటర్ విద్యార్థిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగుడు
నవీన్‌కుమార్ అనే ఇంటర్ విద్యార్థిపై ఓ దుండగుడు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన కడప జిల్లా రాజంపేట రైల్వేస్టేషన్లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆ విద్యార్థిని 108 వాహనంలో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆ యువకుడి శరీరం 65 శాతం కాలిపోయిందని, పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
కడప జిల్లా ఖాజీపేటకు చెందిన నవీన్‌కుమార్ తిరుపతిలోని చైతన్య కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడని, కడప నుంచి తిరుపతికి రైలులో వెళ్తుండగా నందలూరు వద్ద ఓ గుర్తు తెలియని యువకుడితో ఆ విద్యార్థికి గొడవ చెలరేగిందని చెప్పారు. రైలు తలుపు దగ్గర నిలబడే విషయంలో వీరిద్దరికీ వివాదం జరిగిందని, రైలు రాజంపేట చేరుకోగానే నవీన్‌కుమార్‌పై ఆ యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడని చెప్పారు. ఈ ఘటనకు పాల్పడ్డ నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.