: సావిత్రి గురించి బాహ్య ప్రపంచానికి తెలియని విషయాలు చెప్పిన ఆమె కుమార్తె విజయ చాముండేశ్వరి
తెలుగింటి ఆడపడుచు సావిత్రి గురించి తెలియని సినీ అభిమాని ఉండడంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు స్టార్ హీరో ఎవరైనా హీరోయిన్ గా సావిత్రి ఉండాల్సిందే. కేవలం తెలుగే కాదు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో ఆమె తిరుగులేని స్టార్ గా వెలుగొందారు. అయితే చివరి రోజుల్లో మద్యానికి బానిసై దుర్భర జీవితాన్ని చవిచూశారని, ఆస్తులున్నీ హారతికర్పూరంలా కరిగిపోయాయని భిన్న కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఇలాంటి వాటిపై సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి బాహ్య ప్రపంచానికి తెలియని విషయాలు వెల్లడించారు. ఒక ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తనకు 16 ఏళ్ల వయసులో తన తల్లిదండ్రులు వివాహం చేశారని తెలిపారు. తన వివాహానికి రెండేళ్ల ముందే అమ్మ (సావిత్రి), నాన్న (జెమినీ గణేషన్) ల మధ్య విభేదాలు తలెత్తాయని తెలిపారు.
అయితే వారి మధ్య ఏం జరుగుతోందో? ఎందుకు గొడవలు వస్తున్నాయో? కూడా అర్థమయ్యేది కాదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే వారి మధ్య ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ ఇద్దరూ తనతో ప్రేమగా ఉండేవారని ఆమె గుర్తు చేసుకున్నారు. తన తండ్రి ఇంట్లో ఉండకపోయినా...తనతో టచ్ లో ఉండేవారని, తాను వారిదగ్గరకు వెళ్లేదానినని తెలిపారు. ఆ తరువాతే అసలు ఏం జరుగుతోంది? ఎందుకు విభేదాలు మొదలయ్యాయో తెలిసేదని ఆమె చెప్పారు. ఆ విభేదాల వల్ల తనకు ఎక్కువ నష్టం జరగకపోయినా...తన తమ్ముడు మాత్రం ఇబ్బంది పడ్డాడని ఆమె చెప్పారు.
అయితే అతను పెరిగి పెద్దయ్యే సరికి ఆ విభేదాలన్నీ సమసిపోయాయని ఆమె చెప్పారు. ఇక తన తల్లి విషయానికొస్తే.. ఆమె చాలా అమాయకురాలని ఆమె చెప్పారు. ఆమెకు కనీసం సమస్యలను ఎలా డీల్ చేయాలో కూడా తెలిసేది కాదని అన్నారు. ఆమె అమాయకత్వమే ఆమెకు చాలా చెడు చేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఆమెకు సరైన గైడెన్స్ కూడా లేదని ఆమె చెప్పారు. అందుకే ఆమె మద్యానికి బానిసయ్యారని ఆమె చెప్పారు. ఆ తరువాత ఆమె సుమారు 19 నెలలు కోమాలో ఉండిపోయారని, ఆమె తిరిగి బతుకుతుందని తాము ఎన్నో ఆశలు పెట్టుకున్నామని ఆమె చెప్పారు. అయితే తమ ఆశలు వమ్మయ్యాయని ఆమె తెలిపారు.
తన తల్లిని 19 నెలలు ఆసుపత్రి బెడ్ పై చూడడం నరకంలా అనిపించేందని ఆమె తెలిపారు. ఈ సమయంలో తన తండ్రి అనుభవించిన వేదన అంతా ఇంతా కాదని ఆమె అన్నారు. అమ్మను అలా చూసి ఆయన చలించిపోయారని విజయ చాముండేశ్వరి గుర్తు చేసుకున్నారు. ఇక ఆమె ఆస్తులుపై ఉన్న కథనాలు తప్పుడు కథనాలని ఆమె తెలిపారు. ఆమె చనిపోయాక కూడా తాము ఎలాంటి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోలేదని అన్నారు. ఆమె ఎంత పోగొట్టుకున్నా, అంతకంటే ఎక్కువే సంపాదించారని ఆమె తెలిపారు.
ఈ రోజు కూడా తన తల్లి సంపాదించిన సంపాదనతో జీవితాన్ని హాయిగా గడిపేయొచ్చని ఆమె తెలిపారు. తన తల్లి గురించి భావి తరాలకు తెలియాలన్న ఆలోచనతోనే తాను ఆమె బయోపిక్ కు అంగీకరించానని ఆమె తెలిపారు. అలాగే ఆమె ఎదిగిన విధానం, ఆమె స్టార్ గా వెలుగొందిన వైనంపై తీస్తానన్న షరతుతోనే బయోపిక్ కు అంగీకరించానని, స్క్రిప్టు కూడా ముందు చదవాలని షరతు పెట్టానని ఆమె తెలిపారు.