: 'ఆలౌట్' చేసి రండి... సీఆర్పీఎఫ్ కు కేంద్రం నుంచి గోఎహెడ్ ఆదేశాలు!
మూకుమ్మడి దాడి చేసి, 26 మంది జవాన్ల ప్రాణాలను బలిగొన్న మావోయిస్టులను సమూలంగా ఏరివేసేందుకు కేంద్రం కీలక ఆదేశాలు వెలువరించింది. అడవుల్లోని మావోలపై దాడులు జరిపి 'ఆలౌట్' చేయాలని, సాధ్యమైనంత త్వరలోనే ఫలితాలను చూపించాలని హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ నుంచి, సీఆర్పీఎఫ్ డీజీ సుదీప్ లఖ్టాకియా, సీనియర్ సెక్యూరిటీ అడ్వయిజర్ కే విజయ్ కుమార్ లకు ఆదేశాలు అందాయని తెలుస్తోంది. నక్సల్స్ పై అనుసరిస్తున్న వ్యూహాలను పూర్తిగా మార్చుకోవాలని, వచ్చే రెండున్నర నెలల వ్యవధిలో ఒక్క మావో కూడా కనిపించకుండా చూడాలని ఆయన ఆదేశించినట్టు సమాచారం.
"మీకేం కావాలో చెప్పండి. మరింత మంది జవాన్లు కావాలా? సాంకేతిక సహకారం కావాలా? ఇంకా ఏమైనా ఆయుధాలు కావాలా? ఏదడిగినా మీముందు ఉంచుతాను. నాకు మాత్రం ఫలితాలు కనిపించాలి" అని ఆయన గట్టిగా చెప్పినట్టు సీఆర్పీఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. నిన్న మృతులకు నివాళులు అర్పించేందుకు రాయపూర్ వెళ్లిన రాజ్ నాథ్, ప్రతీకారం తీర్చుకుని తీరుతామని ప్రతిజ్ఞ చేసిన సంగతి తెలిసిందే. వచ్చే నెల 8వ తేదీన దేశంలోని 10 మావో ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఉన్నత స్థాయి సమావేశాన్ని ఢిల్లీలో నిర్వహిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.