: కర్ణాటక అధికారుల్లో 90 శాతం మంది అవినీతిపరులే: లోకాయుక్త సంచలన వ్యాఖ్య
కర్ణాటక రాష్ట్రంలో ఉన్న అధికారుల్లో కేవలం 10 నుంచి 15 శాతం మంది మాత్రమే నిజాయతీపరులని లోకాయుక్త పి.విశ్వనాథ శెట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు. మిగిలిన వారంతా అవినీతిపరులేనని చెప్పారు. వీరిలో 20 శాతం మంది అత్యంత అవినీతిపరులని అన్నారు. తమ పనులను చేయించుకోవడానికి ప్రజలే లంచం ఇవ్వడానికి సిద్ధమవుతున్నారని చెప్పారు. ప్రజల్లో ఈ భావం తొలగిపోనంత వరకు, అవినీతి అధికారులు ఉన్నంత వరకు అవినీతిని అంతమొందించలేమని తెలిపారు. కర్ణాటక లోకాయుక్తలో 6,500 కేసులు పెండింగ్ లో ఉన్నాయని ఆయన చెప్పారు. కేసుల సత్వర విచారణ కోసం అదనపు సిబ్బందిని నియమించాలని ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిపారు. కర్ణాటక ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.