: కర్ణాటకలో సరికొత్త రికార్డును సృష్టించిన 'బాహుబలి-2'
'బాహుబలి-2' సినిమా కోసం యావత్ దేశం ఎదురుచూస్తోంది. మరోవైపు, కట్టప్ప పాత్రధారి సత్యరాజ్ వివాదంతో... కర్ణాటకలో ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో ఆడనివ్వమంటూ అక్కడి కన్నడ సంఘాలు హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే సత్యరాజ్ కూడా కన్నడిగులకు క్షమాపణలు చెప్పడంతో ఆందోళనకారులు మెత్తబడి, సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో, ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న కన్నడ ప్రేక్షకులు ఖుషీ అయ్యారు.
మొన్నటి వరకు కర్ణాటకలో ఈ సినిమా విడుదలవుతుదో? లేదో? అనే సందేహం తలెత్తగా... ఇప్పుడు ఇదే సినిమా అక్కడ రికార్డులను సృష్టిస్తోంది. కర్ణాటక వ్యాప్తంగా ఏకంగా 700 థియేటర్లలో ఈ సినిమాను ఏక కాలంలో పదర్శించేందుకు ఏర్పాట్లు జరిగిపోయాయి. కన్నడ సినీ చరిత్రలో ఇది కనీవినీ ఎరుగని రికార్డ్ కావడం గమనార్హం. మరి అక్కడ ఈ సినిమా ఏ మేరకు కలెక్షన్లను కొల్లగొడుతుందో వేచి చూడాలి.