: మన చెంత ఇది ఉంటే సెల్ చార్జింగ్ కు లోటు ఉండదట!
ప్రస్తుత కాలంలో తినడానికి తిండి ఉన్నా లేకున్నా ఫర్వాలేదు కానీ... స్మార్ట్ ఫోన్ లో చార్జింగ్ లేకపోతే మాత్రం క్షణం గడవడం కష్టంగా మారింది. ఒంటరిగా ఉంటే స్మార్ట్ ఫోన్ తో సహవాసం చేస్తారు...పదిమందిలో ఉన్నా స్మార్ట్ ఫోన్ తోనే జీవితాన్ని గడిపేసే వారు ఎంతో మంది ఉన్నారు. వారి స్మార్ట్ ఫోన్ దాహం తీర్చేందుకు డ్యుయల్ బ్యాటరీలు, పవర్ బ్యాంక్ ఇలా ఎన్నో పరికరాలు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. అయితే అవి అందులో పవర్ ఉన్నంత వరకు మాత్రమే పని చేస్తాయని, తాము తయారు చేసిన పరికరం బ్యాగులో ఉంటే ఆ పరికరాలతో పని లేదని కెనడాకు చెందిన సీఫార్మిటిక్స్ అనే సంస్థ చెబుతోంది.
వాటర్ లిలీ అంటే ముద్దుగా పిలిచే ఈ పరికరం ప్రత్యేకత ఏంటంటే...వీచే గాలి, పారే నీటితో విద్యుత్ ను తయారు చేసి, బ్యాటరీ ఫుల్ చేయడం. ఇది బ్యాగులో పట్టేంత చిన్న పరికరమే కాకుండా 800 గ్రాములకు మించని బరువుతో ఉంటుందని ఆ సంస్థ వెల్లడించింది. ఇది చాలా నెమ్మదిగా పారే నీటిలో కూడా 25వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని ఆ సంస్థ ప్రకటించింది. అలాగే దీనితో బైక్ పై సుమారు 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినా చెక్కు చెదరదని, విద్యుత్ ను ఉత్పత్తి చేస్తుందని ఆ సంస్థ తెలిపింది. మరో మూడు నెలల్లో అందుబాటులోకి రానున్న ఈ గాడ్జెట్ ధర 7,000 రూపాయల వరకు ఉంటుందని అంచనా.