: కళాతపస్వి విశ్వనాథ్ కు అవార్డు రావడం మా అందరికీ సంతోషం: చిరంజీవి
ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి కె. విశ్వనాథ్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడం తమ అందరికీ చాలా సంతోషంగా ఉందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఈ సందర్భంగా విశ్వనాథ్ నివాసానికి వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం, చిరంజీవి మాట్లాడుతూ, ‘కళాతపస్వి..మా గురువు గారు, మహా దర్శకులు విశ్వనాథ్ గారికి దాదాసాహెబ్ అవార్డు రావడం అన్నది మా అందరికీ చాలా సంతోషాన్ని ఇచ్చే అంశం. మరీ గర్వకారణంగా ఉంది. నాకు వారితో ఉన్న అనుబంధం, కేవలం నటుడిగానే కాకుండా, కుటుంబపరమైన అనుబంధం కూడా ఉంది. మా విశ్వనాథ్ గారికి ఈ అవార్డు వరించడమనేది మాటల్లో చెప్పలేని ఓ అనుభూతికి లోనవుతున్నాను. సరే, ఈ అవార్డు రావాల్సిన సమయంలో వచ్చిందా? లేదా? అనే మాటలు అనవసరం. ఈ అవార్డు ఎప్పుడో ఆయన్ని వరించి ఉండాల్సింది. ఈ అవార్డు రావడం ఆయనకు ఎంత గర్వకారణమో తెలియదుగానీ, మా అందరికీ చాలా గర్వకారణంగా ఉంది’ అని సంతోషం వ్యక్తం చేశారు.