: ఐసీసీతో బీసీసీఐ వివాదం...ఐసీసీ కొమ్ములు వంచుతున్న బీసీసీఐ


బీసీసీఐ అధ్యక్షుడి హోదాలో ఐసీసీ చీఫ్ పదవి చేపట్టిన శశాంక్ మనోహర్ బీసీసీఐని ముంచేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. దీంతో చిత్రవిచిత్రమైన ఎత్తులతో బీసీసీఐ ఆదాయానికి గండికొట్టే ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాడు. భారత్ లో నిర్వహించిన ట్రోఫీలకు తక్కువ నిధులు విడుదల చేస్తూ, ఇంగ్లండ్ లో నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి భారీ ఎత్తున నిధులు విడుదల చేశాడు. దీంతో బీసీసీఐ ఇదేం విధానం అని అడిగితే...'క్రికెట్ పుట్టిల్లు ఇంగ్లండ్ లో క్రికెట్ ప్రతిష్ఠ పెంచేందుకు' అని తలతిక్క సమాధానం చెప్పాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు నిధుల విడుదలకు, క్రికెట్ ప్రతిష్ఠ పెంచేందుకు సంబంధం ఏంటని బీసీసీఐ నిలదీస్తే...ఐసీసీ నిర్ణయాల్లో బీసీసీఐ తలదూర్చకూడదని రూల్స్ మాట్లాడాడు. అలాగే నూతన ఆదాయ పంపిణీ విధానంలో భాగంగా అదనంగా మరో 100 మిలియన్‌ డాలర్లు బీసీసీఐకి అందజేస్తామని శశాంక్ మనోహర్ సరికొత్త ప్రతిపాదనతో ముందుకు వచ్చారు. దీనిపై అగ్గిమీద గుగ్గిలమైన బీసీసీఐ నిర్మొహమాటంగా ప్రతిపాదనను తిరస్కరించింది.

దీనిపై ఒక సీనియర్ బీసీసీఐ అధికారి మాట్లాడుతూ, ‘అవును. కొత్త ఆదాయ పంపిణీ విధానంలో బీసీసీఐకి మరో 100 మిలియన్‌ డాలర్లు అదనంగా అందిస్తామని మనోహర్‌ ప్రతిపాదించారు. నిజం చెప్పాలంటే ఆయన ఇందుకు తుదిగడువును సైతం నిర్ణయించారు. ఐతే మేము దీన్ని ప్రతిపాదనగా స్వీకరించలేదు. అసలు పట్టించుకోనేలేదు’ అని ఒక సీనియర్ అధికారి తెలిపారు. ఆయన ఇంకా మాట్లాడుతూ, ‘ఈ ప్రతిపాదన మనోహర్‌ నుంచి వచ్చింది. ఎవరికెంత ఆదాయం రావాలో ఐసీసీ సభ్యదేశాలు కలిసి నిర్ణయిస్తాయి. ఛైర్మన్‌ కు ఆ అధికారం లేదు. అలాంటప్పుడు ఆయన ఎలా నిర్ణయిస్తారన్నది ప్రశ్న. అంతే కాకుండా ఈ నూతన ఆదాయపంపిణీ విధానంపై ఇతర దేశాలతో కలిసి కొత్త ఫార్ములా కనుగొనే పనిలో బీసీసీఐ బిజీగా ఉంద’ని ఆయన తెలిపారు. కాగా, ఐసీసీ ప్రకటించిన ప్రస్తుత బిగ్‌ 3 పంపిణీ విధానంలో...ఐసీసీ నుంచి బీసీసీఐకి 579 మిలియన్‌ డాలర్లు అందేవి.

 ఐసీసీ తీసుకురానున్న నూతన ఆదాయ పంపిణి విధానం ద్వారా బీసీసీఐకి 200-300 మిలియన్‌ డాలర్ల ఆదాయం మాత్రమే వస్తుంది. క్రికెట్ అంటే కాసుల పంట అయిన భారత్ లో ఇది ఏమాత్రమూ సరిపోదు. దీంతో ఈ విధానాన్ని సుప్రీంకోర్టు నియమించిన పాలకుల బృందం సైతం వ్యతిరేకిస్తోంది. మరోవైపు ఐసీసీకి షాక్ ఇచ్చేందుకు బీసీసీఐ మరో సాహసం చేస్తోంది. ఐసీసీ జూన్ మొదటి నుంచి ఇంగ్లండ్ లో నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టును ప్రకటించేందుకు నేడే తుది గడువు. బీసీసీఐ ఇంకా భారత జట్టును ప్రకటించలేదు. ఐసీసీ రూల్స్ ప్రకారం తుది గడువు ప్రకటించే నాటికి జట్టును ప్రకటించకపోతే ఆ దేశంపై అనర్హత వేటు వేయాలి...ఐసీసీ ఇప్పుడు బీసీసీఐని నిషేధిస్తుందా? అని బీసీసీఐ తమాషా చూస్తోంది. 


అలా జరిగితే చాంపియన్స్ ట్రోఫీపై భారతీయులకు ఇంట్రెస్ట్ పోతుంది. ఇది టీవీ వీక్షకుల సంఖ్యను తగ్గిస్తుంది. ఇది ఐసీసీ వేలం వేసిన టెలివిజన్ హక్కులపై ప్రభావం చూపుతుంది. దీంతో ఆదాయం పడిపోతుంది. దీంతో ఐసీసీకి కొత్త తలనొప్పి వస్తుంది. ఇప్పుడు బీసీసీఐ జట్టును ప్రకటించేలా గడువు పెంచుతుందా? లేక బీసీసీఐపై రూల్స్ పేరిట నిషేధం విధిస్తుందా? అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఐపీఎల్ నిర్వహణలో బిజీగా ఉన్న బీసీసీఐ...ఐసీసీ ఆదేశాలను పట్టించుకోకపోవడంతో శశాంక్ మనోహర్ కు ఇబ్బందిగా మారింది. బీసీసీఐని ఇబ్బంది పెట్టాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న శశాంక్ కు బీసీసీఐ దీటుగా సమాధానమిస్తోంది. 

  • Loading...

More Telugu News