: ఎర్రబుగ్గను ఇప్పుడే తొలగించనన్న కర్ణాటక సీఎం
వీఐపీ కల్చర్ కు స్వస్తి పలకాలన్న ఆలోచనతో వీఐపీల కార్లపై ఎర్రబుగ్గలను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అనుసరించి ఇప్పటికే పలువురు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు తమ వాహనాలపై ఉన్న ఎర్రబుగ్గలను తొలగించారు. అయితే, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాత్రం దీనిపై ఒకింత భిన్నంగా స్పందించారు. తాను ఇప్పటికిప్పుడే ఎర్రబుగ్గను తొలగించనని... కేంద్రం తీసుకున్న నిర్ణయం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందో అప్పుడే తొలగిస్తానని చెప్పారు. "మే 1వ తేదీ నుంచి కదా తొలగించాల్సింది. అప్పుడే తొలగిస్తా" అని స్పష్టం చేశారు.
కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రకారం కేవలం అంబులెన్స్, ఫైర్, పోలీస్, ఆర్మీ వాహనాలకు మాత్రమే ఈ విషయంలో మినహాయింపును ఇచ్చారు. మే 1వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. ఇప్పటికే ఎర్రబుగ్గను తొలగించిన ముఖ్యమంత్రుల్లో తమిళనాడు సీఎం పళనిస్వామి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్, ఉత్తరాఖండ్ సీఎం రావత్, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ లు ఉన్నారు.