: ఢిల్లీ విమానాశ్రయంలో నితీష్ కుమార్‌ను అవమానించిన ప్రయాణికుడు!
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు ఢిల్లీ విమానాశ్రయంలో ఊహించని అనుభవం ఎదురైంది. ముంబై నుంచి వచ్చిన విమానం నుంచి దిగిన నితీష్ వీఐపీలు, వృద్ధుల కోసం కేటాయించిన బ్యాటరీ కారులోకి ఎక్కబోతుండగా... ఓ ప్రయాణికుడు కోపంగా కారులోని ముందు సీట్లో కూర్చొని... 'వీఐపీ సంస్కృతి వద్దు' అంటూ గట్టిగా అరిచాడు. కారు దిగాలంటూ సెక్యూరిటీ సిబ్బంది కోరినా... అతను వినలేదు. అరుస్తూనే ఉన్నాడు. దీంతో, ఏమీ చేయలేక అతడిని కూడా అదే బ్యాటరీ కారులోనే తీసుకెళ్లారు. నితీష్ అంతర్జాతీయ లాంజ్ వద్ద దిగిపోగా... అతను మాత్రం ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వరకు వెళ్లాడు.
ఏ రాష్ట్ర ముఖ్యమంత్రినైనా విమానాశ్రయాల్లో వీఐపీలుగా చూస్తారు. రన్ వే పైకి వెళ్లడానికి, అక్కడ నుంచి రావడానికి, ఇమ్మిగ్రేషన్ కౌంటర్ల వద్దకు వెళ్లడానికి... వీరి కోసం బ్యాటరీ కార్లను ఉపయోగిస్తారు. అంతేకాదు, వ్యక్తిగత భద్రతను కూడా కల్పిస్తారు. ఢిల్లీ విమానాశ్రయంలో వాకలేటర్లు, ఎస్కలేటర్లు బ్రహ్మాండంగా పనిచేస్తున్నా... ముఖ్యమంత్రుల కోసం బ్యాటరీ కార్లను వాడటం పరిపాటి. ఈ విమానాశ్రయంలో ఇలాంటి కార్లు 30 ఉన్నాయి.
అయితే, నితీష్ కారులో కూర్చున్న వ్యక్తి ఎలాంటి హానికారకమైన పనులు చేయకపోవడంతో... అతడిని ఏమీ చేయలేదని సీఐఎస్ఎఫ్ దళాలు తెలిపాయి. నితీష్ కూడా ఆ వ్యక్తి పట్ల ఎలాంటి ఆగ్రహం ప్రదర్శించలేదు.