: జార్ఖండ్ లో 12 వేల ఆవులకు ఇప్పటికే ఆధార్!
గోవుల అక్రమరవాణాకు అడ్డుకట్టవేసేందుకు దేశవ్యాప్తంగా ఆవులకు ఆధార్‌లాంటి ఐడీని కేటాయిస్తామని నిన్న కేంద్ర సర్కారు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, జార్ఖండ్ సర్కారు మాత్రం ఇప్పటికే ఆ పనులు మొదలు పెట్టేసి, తమ రాష్ట్రంలో 12 వేల ఆవులకు ఇప్పటికే 12 అంకెల ఓ ఐడీని కేటాయించింది. ఈ నెంబరు జారీ చేయడానికి గోవు వయసు, జాతి, ఎత్తు, రంగు, కొమ్ముల ఆకారం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంది.
ఈ పద్ధతిపై అక్కడి అధికారులు మాట్లాడుతూ... ఆవుల అక్రమ రవాణాతో పాటు వాటి ఆరోగ్యం, పాల ఉత్పత్తిని సమీక్షించడం కోసం ఈ ఐడీలు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఏడాది కాలంలో 12 వేల ఆవుల ట్యాగింగ్ పూర్తి చేశామని చెప్పారు. ఆవులకు కేటాయించిన ఈ 12 అంకెల ఐడీలను ఆవుల చెవులకు శాశ్వతంగా ఉండే ఏర్పాటు చేశామని అన్నారు. రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో ఈ పైలట్ ప్రాజెక్ట్‌పై పనిచేస్తోందని, త్వరలోనే రాష్ట్రంలోని మొత్తం 24 జిల్లాల్లో ఆవులకు ఆధార్ ఇవ్వనున్నామని తెలిపారు.