: రిలయన్స్ జియో మరో రికార్డు... 10 కోట్లను దాటిన యూజర్లు
గత సంవత్సరం సెప్టెంబర్ 5న రిలయన్స్ జియో మార్కెట్లోకి వచ్చిన తరువాత, అతి తక్కువ వ్యవధిలోనే 10 కోట్ల మంది వినియోగదారులను చేర్చుకున్న టెల్కోగా రికార్డు సృష్టించింది. సంస్థ కస్టమర్ల సంఖ్య 100 మిలియన్ మైలురాయిని దాటిందని సంస్థ ప్రకటించింది. ప్రీమియర్ సభ్యుల సంఖ్య 7.2 కోట్లను దాటిందని పేర్కొంది. అయితే, ఉచిత సభ్యత్వం కొనసాగడం, తక్కువ ధరలకే డేటాను ఇచ్చిన కారణంగా నాలుగో త్రైమాసికంలో ఆదాయం 76 శాతం తగ్గి రూ. 2.25 కోట్ల నుంచి రూ. 54 లక్షలకు తగ్గిందని జియోపై మొత్తం రూ. 34.88 కోట్లను వెచ్చించామని తెలిపింది.
మరో లక్ష టవర్లను సమీప భవిష్యత్తులో ఏర్పాటు చేయనున్నామని, దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో 4జీ సేవలను దగ్గర చేయడమే తమ లక్ష్యమని పేర్కొంది. ఢిల్లీ, ముంబై నగరాల్లో 'ఫైబర్ టు ది హోం' వ్యాపారాన్ని ప్రారంభించామని, ప్రస్తుతం ట్రయల్స్ జరుగుతున్నాయని వెల్లడించింది. ఇప్పటివరకూ 26 లక్షల ఎల్ వైఎఫ్, జియోఫై రూటర్లను విక్రయించామని, నెలకు 220 కోట్ల కాల్స్, 110 కోట్ల గిగాబైట్ల ట్రాఫిక్ లో ప్రపంచంలోనే అతిపెద్ద నెట్ వర్క్ గా నిలిచామని తెలిపింది.