: చిన్న పిల్లలు కూడా చాక్లెట్ల కోసం అలా కొట్లాడరు: ప్రతిపక్షాలకు సీఎం కేసీఆర్ చురకలు
హైదరాబాద్లోని మాదాపూర్లో ఈ రోజు రైతుహితంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సదస్సు నిర్వహించి ఉపన్యాసం చేశారు. ఇంతకు ముందు తెలంగాణలో విద్యుత్ కోతలు అధికంగా ఉండేవని, ఇప్పుడు ఆ సమస్యే లేకుండా చేశామని అన్నారు. వ్యవసాయ రంగానికి అధికంగా విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. తమ ప్రభుత్వం ఓ ప్రణాళిక ప్రకారం ముందుకు వెళుతోందని చెప్పారు. లక్ష కిలోమీటర్ల దూరమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభం అవుతుందని అన్నారు.
వచ్చే ఏడాది నుంచి రైతులకు పెట్టుబడి కూడా ఇస్తామని కూడా తాము ప్రకటించామని అన్నారు. త్వరలోనే వ్యవసాయ రంగంలో 500 మంది అధికారుల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. అయితే, తాము ప్రకటించిందే ఆలస్యం.. వెంటనే చేసేయాలని విపక్ష పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రకటించిన వెంటనే చేసేయాలా? అని ఆయన ప్రశ్నించారు. చిన్న పిల్లలు కూడా చాక్లెట్ల కోసం అలా కొట్లాడబోరని సీఎం కేసీఆర్ చురకలంటించారు.
అంచెలంచెలుగా పోరాటాలు చేసి ప్రత్యేక తెలంగాణ సాధించామని, తెలంగాణ అభివృద్ధి సాధించి భారతదేశానికే దిక్సూచి అవుతుందని కేసీఆర్ అన్నారు. ఇప్పుడు ఎరువులు, విద్యుత్ కొరత లేకుండా చేశామని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనంత ప్రగతి తెలంగాణలో ఉందని అన్నారు. మంచి వృద్ధిరేటు ఉన్న రాష్ట్రంలో వ్యవసాయ రంగంలోనూ లాభాలు రావడానికి కృషి చేస్తోందని అన్నారు. త్వరలోనే వ్యవసాయ అధికారులకు ల్యాప్ టాప్లు కూడా అందిస్తామని అన్నారు. వ్యవసాయ రంగమే ఎంతో మందికి ఉపాధి కల్పిస్తోందని చెప్పారు. ఎన్నో అవమానాలు, అవహేళనలు ఎదుర్కొని తెలంగాణ సాధించుకున్నామని ప్రణాళికలు రచించుకొని బంగారు తెలంగాణ సాధిస్తామని చెప్పారు. మన సమాజంలో రైతులకు గౌరవం తగ్గడం బాధాకరమని ఆయన అన్నారు.