: జాగ్రత్తగా వుండండి.. మే నెలలో వేసవి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉదయం అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ప్రజారోగ్యంపై మాట్లాడారు. ఆరోగ్య ఖర్చులు ప్రతి కుటుంబానికి మోయరాని భారంగా మారుతున్నాయని, ఆరోగ్యంపై ఖర్చులు తగ్గించడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పలు అంశాలపై దృష్టి పెట్టిందని చెప్పారు. ఎన్టీఆర్ వైద్యసేవ, ఆరోగ్యరక్ష, ఉచిత క్లినికల్ టెస్ట్‌లు, సీఎం ఆరోగ్య కేంద్రాలు వంటి పలు పథకాలు అమలు చేస్తున్నామని, అందరికీ ఆరోగ్యం సమకూరితే రాష్ట్రమంతా ఆనందమేనని ఆయన వ్యాఖ్యానించారు. ఎండల తీవ్రత దృష్ట్యా వడదెబ్బ నివారణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని చంద్రబాబు నాయుడు సూచించారు.
వచ్చే నెలలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పిన చంద్రబాబు..వడదెబ్బ తగలకుండా అందరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు, నరేగా (జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం) పనుల వద్ద ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచాలని ఆయన అధికారులకు సూచించారు. ప్రధానకూడళ్లతో ప్రజలకు తాగునీరు, మజ్జిగ పంపిణీకి ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు. అలాగే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఆయన అన్నారు.