: తొలి ఎన్నికలో ఆధిక్యం... ఫ్రాన్స్ కు అతి చిన్న వయసు అధ్యక్షుడిగా మేక్రన్!
ఫ్రాన్స్ కు నూతన అధ్యక్షుడిగా నిలిచే దిశగా 39 ఏళ్ల ఇమ్మాన్యుయెల్ మేక్రన్ మరో అడుగు ముందుకేశారు. తొలి దశ ఎన్నికలు పూర్తికాగా, ఓట్ల లెక్కింపులో యూరోపియన్ సమాఖ్య (ఈయూ)కు అనుకూల అభ్యర్థిగా ‘ఎన్ మార్చే’ పార్టీ నుంచి బరిలోకి దిగిన ఇమ్మాన్యుయెల్ మేక్రన్ కు 23.75 శాతం ఓట్లు రాగా, ఆయన ప్రత్యర్థి, నేషనల్ ఫ్రంట్ కు చెందిన మారిన్ లి పెన్ కు 21.53 శాతం ఓట్లు వచ్చాయి. మే 7వ తేదీన వీరిద్దరి మధ్య రెండో విడత ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఎన్నికల్లోనూ మేక్రన్ గెలిస్తే ఫ్రాన్స్ దేశానికి అత్యంత పిన్న వయసులో అధ్యక్షుడయిన రికార్డును సొంతం చేసుకుంటారు. ఒకవేళ లి పెన్ (48) విజయం సాధిస్తే ఆ దేశ తొలి మహిళా అధ్యక్షురాలు అవుతారు. కాగా, రెండో విడతలో కూడా మేక్రన్ కే అవకాశాలు అధికమని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.