: 'బాహుబలి-2 చూడాల్సిందే' అంటూ కానిస్టేబుల్ రాసిన లీవ్ లెటర్ ఇది!
మరో మూడు రోజుల్లో థియేటర్లను తాకనున్న బాహుబలి-2 మేనియా ఎలా ఉందో తెలిపేందుకు మరో ఉదాహరణ ఇది. వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న విజయ్ కుమార్ (పీసీ 1511), తనకు సెలవు కావాలని కోరుతూ రాసిన ఓ దరఖాస్తు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ లేఖలో బాహుబలి-2 సినిమా చూడటానికి లీవు కావాలని, గత రెండేళ్లుగా "వై కట్టప్ప కిల్డ్ బాహుబలి?" అన్న ప్రశ్నకు సమాధానం లభించక, డ్యూటీపై ఏకాగ్రత పెట్టలేకున్నానని చెప్పుకున్నాడు. ఈ నెల 28న విడుదల అవుతున్న సినిమా మార్నింగ్ షోకు వెళ్లి, తన సందేహాన్ని తీర్చుకునేందుకు సీఎల్ మంజూరు చేయాలని ప్రార్థిస్తున్నట్టు కోరాడు. ఇక అతనికి లీవు మంజూరు అయిందా? లేదా? అన్న విషయం మాత్రం తెలియరాలేదు.